NTV Telugu Site icon

Anti-India agenda: రామనవమి హింసపై ముస్లిం దేశాల కూటమి ప్రేలాపన.. తీవ్రంగా స్పందించిన భారత్..

India On Oic

India On Oic

Anti-India agenda: భారత్ అంటేనే నిలువెల్ల విషంలో మాట్లాడుతుంటుంది ముస్లిం దేశాల కూటమి ‘‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)’’. ఇప్పటికే పలుమార్లు భారత అంతర్గత విషయాలపై స్పందిస్తూ ఇండియాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఐఓసీ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రామనవమి అల్లర్లపై ఓఐసీ అర్థపర్థం లేని ఆరోపనలు చేసింది. దీంతో మరోసారి తీవ్రంగా స్పందించింది భారత్.

రామ నవమి సందర్భంగా భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఓఐసీ సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఐసీ మతతత్వ ఆలోచనతో, భారత వ్యతిరేక ఎజెండాతో పనిచేస్తుందని నిందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. ఓఐసీ విడుదల చేసి ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, భారత వ్యతిరేక శక్తులచే వంతపాడుతూ ఐఓసీ తమ ప్రతిష్టను దెబ్బతీస్తోందని బాగ్చీ అన్నారు.

Read Also: Home Theatre Blast: హోం థియేటర్ పేలుడులో ట్విస్ట్.. బాంబు పెట్టి గిఫ్టుగా ఇచ్చిన పెళ్లికూతురు లవర్..

భారతదేశంలో ముస్లిం సమాజంపై ఇస్లామోఫోబియా పెరిగిందని, రెచ్చగొట్టే హింస, విధ్వంసక చర్యలను ఖండిస్తున్నట్లు ఓఐసీ ఓ ప్రకటనలో పేర్కొంది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ ను కోరింది. దేశంలోని ముస్లిం సమాజం భద్రత, హక్కులు, గౌరవాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. దీనిపై భారత్ కూడా అంతే ఘాటు స్పందిస్తూ ఓఐసీ వ్యాఖ్యలను ఖండించింది.

రామనవమి రోజు దేశంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన మతకలహాలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్ హౌరా, హుగ్లీల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. బీహార్ నలంద, ససారం, బీహార్ షరీఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. మహారాష్ట్ర, యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయి.