Anurag Thakur: రామ నవమి వేడుకల్లో హౌరా, బెంగాల్ లోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ మత ఘర్షణలపై బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే దుర్గాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు రాజు ఝా, కొంతమంది సహచరులతో కలిసి కోల్‌కతాకు వెళుతుండగా, శక్తిగఢ్ ప్రాంతంలోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
Read Also: Himanta Biswa Sarma: ఖలిస్తాన్ ఉగ్రవాది నుంచి అస్సాం సీఎంకు బెదిరింపులు..
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ..టీఎంసీ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మత ఉద్రిక్తతలను పెంచుతున్నారని, ఆమె హిందూ వ్యతిరేకి అని, ఓ వర్గానికి మాత్రమే పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్ లో రామభక్తులను కొట్టారని, శోభాయాత్రను బలవంతంగా నిలిపేయాల్సి వచ్చిందని, రామభక్తులపై లాఠీలతో దాడులు చేశారు, రాళ్లురువ్వారు, బాంబులు విసిరారని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. బెంగాల్ లో అల్లర్లు, కాల్పులు మమతా బెనర్జీ పిలుపు మేరకే జరిగాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని అన్నారు. హిందువులపై దాడి జరుగుతుంటే మమత మూగ ప్రేక్షకుడిగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ నిద్రపోతూ.. ఓ వర్గానికి మాత్రమే భద్రత కల్పిస్తోందని, హిందూ సమాజంలోని ప్రజలపై హింసను ప్రేరేపిస్తోందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
మతఘర్షణలు జరిగిన శిబ్ పూర్ ప్రాంతంలో సందర్శించకుండా బీజేపీ రాష్ట్ర చీఫ్ సుకాంత మంజుదార్ను అధికారులు అడ్డుకున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ కేవలం ఒక మతానికి మాత్రమే ముఖ్యమంత్రి అని ఆయన విమర్శించారు. పూర్భా బర్థమాన్ జిల్లాలో బీజేపీ నాయకుడిని హత్య చేయడంపై మమతా బెనర్జీపై మండిపడ్డారు. రామ నవమి అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రామ నవమి రోజు హౌరాలోని పలు ప్రాంతాల్లో శోభాయాత్ర సమయంలో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో పలు వాహనాలు, ఇళ్లు కాల్చివేయబడ్డాయి. హౌరా హింసపై కేంద్ర హోంమంత్రి బెంగాల్ గవర్నర్ ను నివేదిక కోరారు.
