Anna Hazare: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘోరంగా ఓడిపోయింది. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి స్వయంగా ఓడిపోయారు. ఈయనే కాకుండా పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తులు కూడా ఓటమి చవిచూశారు. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 48 చోట్ల బీజేపీ గెలుపొందగా, 22 సీట్లలో ఆప్ గెలిచింది.
Read Also: Mangalyaan-2: ఇస్రో ‘‘మంగళయాన్-2’’.. ప్రధాని ఆమోదం కోసం వెయిటింగ్..
ఇదిలా ఉంటే, ఆప్ ఓటమిపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ మంచి పనులు చేశారని, కానీ మద్యం దుకాణాలు తెరబడం ప్రారంభించడం వల్ల ఢిల్లీ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కున్నారని చెప్పారు. ఒక మహిళ, రేఖా గుప్తా దేశ రాజధానికి సీఎం కావడం గర్వకారణమని చెప్పారు. ఆమె స్వచ్ఛమైన ఆలోచనలు, పనుల కారణంగానే ప్రజలు ఆమెకు ఓటేశారని అన్నారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ సమాజానికి ఒక ఉదాహరణగా నిలవాల్సింది కానీ, దారి తప్పారని, ఆప్ పుట్టుకకు అవినీతి వ్యతిరేక ఉద్యమం కారణమని హజారే అన్నారు.
కేజ్రీవాల్ మంచి పనులు చేస్తున్నందున నేను వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు, కానీ ఆయన నెమ్మదిగా మద్యం దుకాణాలు తెరిచి లైసెన్సులు జారీ చేయడం ప్రారంభించారని, అప్పుడు బాధపడ్డాను అని అన్నా హజారే అన్నారు. ఒకప్పుడు హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్ ఆయన సహచరుడిగా ఉండేవారు. 2012లో ఆప్ స్థాపించిన తర్వాత ఇద్దరూ విడిపోయారు.