Ankita Bhandari Case: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంకితా భండారీ హత్య కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత కుమారుడి రిసార్టులో పనిచేస్తున్న అంకితాను హత్య చేశారు. ఈ హత్యలో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య కీలక నిందితుడిగా ఉన్నారు. దీంతో శుక్రవారం వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే కాలువలో పడిన అంకితా భండారీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. తాజాగా అటాప్సీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంకితా భండారీ నీటిలో మునిగి ఉపిరాడక చనిపోయారాని నివేదిక వెల్లడించింది. మరణానికి ముందు ఆమె శరీరంపై గాయాలను కనుక్కున్నట్లు రిపోర్టు పేర్కొంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.
Read Also: Cricket Tickets Mafia Live: క్రికెట్ టికెట్లతో మాఫియా రాజ్యం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న 19 ఏళ్ల అంకితా భండారి మరణం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్యతో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను అరెస్ట్ చేశారు. అమ్మాయిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. రిసార్టుకు వచ్చే గెస్టులకు ప్రత్యేక సేవలు అందించాలని.. వ్యభిచారిణిగా వ్యవహరించాలని నిందితులు అంకితా భండారీపై ఒత్తడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ఒప్పుకోకపోవడంతోనే ఆమెను ముగ్గురు హత్య చేశారు.
ఈ కేసుపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు. సిట్ ఏర్పాటు చేసి కేసును విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిసార్టులను తనిఖీ చేయాలని.. అక్రమంగా ఉన్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుల్కిత్ ఆర్యకు సంబంధించిన రిసార్టును నిన్న కూల్చివేసింది ప్రభుత్వం.