దేశంలో అక్రమ వలసలు, అసాధారణ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా మార్పులను పర్యవేక్షించేందుకు కేంద్రం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. అక్రమ చొరబాట్లు, ఇతర కారణాల వల్ల జరుగుతున్న అసహజ జనాభా మార్పులు కారణంగా దేశ సార్వభౌమత్వం, జాతీయ భద్రత, సామాజిక సమతుల్యత, గిరిజన సమాజాల రక్షణకు పెద్ద సవాలుగా మారాయని పేర్కొన్నారు.
ఈ కమిటీ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోడీ 2025 ఆగస్టు 15న చేసిన ప్రకటన ఆధారమని అమిత్ షా తెలిపారు. దేశవ్యాప్తంగా జనాభా మార్పుల ధోరణులను అధ్యయనం చేసి.. ముఖ్యంగా అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల సంభవిస్తున్న మార్పులను విశ్లేషించడం కమిటీ ప్రధాన బాధ్యతగా వివరించారు.
ఈ ఉన్నతస్థాయి కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాశ్ ప్రభాకర్ నౌలేకర్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ శామికా రవి సభ్యులుగా ఉండనున్నారు. అలాగే జనగణన కమిషనర్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉంటారు. కేంద్ర హోంశాఖలోని ఫారినర్స్-I విభాగ జాయింట్ సెక్రటరీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
దేశంలోని మత, సామాజిక వర్గాల వారీగా అసాధారణ జనాభా పెరుగుదల నమూనాలను కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. అలాగే సమస్య పరిష్కారానికి సమయపాలిత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కేంద్రానికి సిఫార్సులు చేయనుంది. “జనాభా మార్పు అనేది కేవలం సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమే కాదు. ఇది జాతీయ భద్రత, శాంతిభద్రతలు, సామాజిక నిర్మాణం, గిరిజన సమాజాల పరిరక్షణకు కూడా నేరుగా సంబంధించిన విషయం” అని అమిత్ షా పేర్కొన్నారు.
అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసలు, జనాభా మార్పుల అంశం ఎప్పటికప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.
