Maldives Row: భారత్-మాల్దీవుల మధ్య వివాదం నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా, ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. చైనాతో తమ దేశ సంబంధాల గురించి గొప్పగా చెప్పారు. రెండు దేశాలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నాయని.. మాల్దీవ్స్ సార్వభౌమాధికారానికి పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. 1972లో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నప్పటి నుండి మాల్దీవుల అభివృద్ధికి చైనా సహాయం అందించిందని ప్రశంసలు కురిపించాడు.
గతేడాది నవంబర్‌లో అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇండియా వ్యతిరేక వైఖరి అవలంభించి ముయిజ్జూ గెలుపొందాడు. అప్పటి నుంచి భారత్‌కి వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఇండియా, మాల్దీవ్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆ దేశ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ సమస్య మరింత పెద్దదిగా మారింది. భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ముగ్గురు మంత్రుల్ని మాల్దీవ్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Read Also: Hanuman: ‘హనుమాన్ దెబ్బ’ కేజీఎఫ్, కాంతార రికార్డులు అబ్బా.. పుష్పతో సమానంగా కలెక్షన్స్
ఇదిలా ఉంటే ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన ముయిజ్జూ పలు ఒప్పందాలు చేసుకున్నాడు. మాల్దీవ్స్ తిరిగిరాగానే చైనాను పొగుడుతూ వ్యాఖ్యలు చేస్తున్నాడు. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వైపాక్షిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లిందని ఆయన అన్నారు. చైనా మాల్దీవ్స్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే దేశం కాదని.. అందుకే రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని చైనా ప్రభుత్వ మీడియా సీజీటీఎన్ ఛానెల్‌కి ఇచ్చి ఇంటర్వ్యూలో ముయిజ్జూ చెప్పాడు. భవిష్యత్తులో చైనా-మాల్దీవ్స్ బంధం మరింత దృఢమవుతుందని అన్నారు. జి జిన్‌పింగ్ పౌరుల ప్రయోజనాలకు మొదటిస్థానం ఇస్తున్నారని, ఆయన నాయకత్వంలో చైనా ఆర్థిక వ్యవస్థ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాల్దీవులు తన లక్ష్యాలను సాధించేందుకు చైనా ప్రభుత్వం సాయం చేస్తుందని, ఈమేరకు జిన్ పింగ్ హామీ ఇచ్చినట్లు ముయిజ్జు తెలిపారు.
మార్చి 15లోగా మాల్దీవుల్లో ఉన్న 88 మంది భారత సైనిక సిబ్బంది వెళ్లిపోవాలని మరోసారి ఆ దేశం చెప్పింది. శనివారం మీడియాతో మాట్లాడుతూ, పరోక్షంగా భారత్ ని ఉద్దేశించి ముయిజ్జూ విమర్శలు చేశారు. మేము చిన్నవాళ్లం కావచ్చు, కానీ మమ్మల్ని బెదిరించే లైసెన్స్ మీకు ఇవ్వలేదని అన్నారు. ఆహార వస్తువులు, ఔషధాలు, ఇతర దిగుమతులపై భారత్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ముయిజ్జూ కొత్త ప్రణాళికను ప్రకటించారు.