Haryana Crisis: హర్యానా పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌తో పాటు బీజేపీ పాత మిత్రుడు, జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా వెంటనే బలనిరూపణ పరీక్ష నిర్వహించాలని ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో చౌతాలాకు చెందిన జేజేపీ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నేత, మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్‌ని కలిశారు. గురువారం మధ్యాహ్నం ఈ పరిణామం చోటు చేసుకుంది.
Read Also: Shocking Incident: ఇంటికి తీసుకెళ్లే మార్గంలో 10వ తరగతి విద్యార్థినిపై ఆటోడ్రైవర్ లైంగిక వేధింపులు..
పానిపట్‌లో రాష్ట్ర మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగిందని, జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఖట్టర్, మంత్రి ధండాతో భేటీ అయినట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయ సంక్షోభంపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఖట్టర్ వ్యాఖ్యానించినట్లు నిరాకరించారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ప్రస్తుత బలం 88 కాగా, అందులో బీజేపీకి 40 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు నిలిపేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. గతంలో బీజేపీతో ప్రభుత్వంలో ఉన్న దుష్యంత్ సింగ్ చౌతాలా జేజేపీ లోక్‌సభ సీట్ల విషయంలో విభేదించి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. బీజేపీపై కోపంగా ఉన్న చౌతాలా ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి, ప్రభుత్వం మైనారిటీలో పడిండని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే మద్దతు అందిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చౌతాలా గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చౌతాలాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తారని తెలుస్తోంది.