పశ్చిమ బెంగాల్‌లో మరోసారి హింస జరిగింది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.. దీనిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.. ఇక, ఇప్పుడు బీర్‌భూం జిల్లా రామ్‌పుర్ హాట్ రాజకీయ హింసపై, అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనం కావడం విషాదం నింపింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ బాదు షేక్ హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగానే ఇళ్లకు నిప్పుపెట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. కానీ, వ్యక్తిగత కక్షల అనుమానంతో ఈ ఘటనలో 11 మందిని పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ముమ్మాటికీ రాజకీయ కక్షేనంటూ ఆరోపిస్తున్నాయి.
Read Also: Imran Khan: అవిశ్వాసం ముప్పు..! పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఇక, ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన కోల్‌కతా హైకోర్టు, మధ్యంతర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. రాంపూర్హట్ గ్రామంలో జిల్లా జడ్జి సమక్షంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. వెంటనే ఆధారాలు సేకరించాలని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీని ఆదేశించింది. బీర్‌భూం హింసపై ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. అత్యంత హేయమైన ఘటనగా అభివర్ణించారు. హత్యాకాండలో నేరస్థుల్ని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. ఈ ఘటన రాజకీయ రచ్చగా మారుతోంది. బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దోషులను కాపాడేందుకు మమతాబెనర్జీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలోనూ బీజేపీ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు, బిమన్ బోస్ నేతృత్వంలో సీపీఎం నేతలు రాంపూర్హట్‌లో పర్యటించారు. ఘటనపై ఎన్‌ఐఏ లేదంటే సీబీఐ దర్యాప్తు చేయించాలని సువేందు అధికారి డిమాండ్ చేశారు. బెంగాల్ ను కాపాడేందుకు రాష్ట్రపతి పాలన ఒక్కటే పరిష్కారమని సువేందు వ్యాఖ్యానించారు. మరోవైపు.. బీజేపీ, వామపక్షాల ఆరోపణలు, విమర్శలపై ఘాటుగా స్పందించారు సీఎం మమతా బెనర్జీ. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ రేప్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తమవాళ్లు వెళ్తే అడ్డుకున్నారని… ఇక్కడ మాత్రం తామెవరినీ అడ్డుకోవడంలేదన్నారు. ఇవాళ ఘటనస్థలానికి వెళ్లనున్న మమత, దోషులెవరైనా విడిచిపెట్టేదిలేదన్నారు.