హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర నేటి (జూన్ 30) నుంచి ప్రారంభం కానుంది. గత రెండేళ్లుగా అమర్ నాథ్ యాత్ర జరగలేదు. 2019లో జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ ను ఎత్తేసింది. దీంతో భద్రతా కారణాల వల్ల అమర్ నాథ్ యాత్ర కాలపరిమితిని తగ్గించారు. 2020,2021లో కరోనా మహమ్మారి కారణంగా యాత్ర పూర్తిగా జరగలేదు. దాదాపుగా రెండేళ్ల విరామం అమర్ నాథ్ యాత్రం నేడు ప్రారంభం కానుంది.
ఇప్పటికే యాత్ర కోసం 3 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తొలి బ్యాచ్ లో 4890 మంది యాత్రికులు ఆ పరమశివుడిని దర్శించుకునేందుకు అమర్ నాథ్ గుహకు పయణం అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి బ్యాచ్ జమ్మూ కాశ్మీర్ లోని బాల్తాల్ బేస్ క్యాంపుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర గుహకు తొలిబ్యాచ్ బయలుదేరుతుంది. గుహను చేరుకోవడానికి సుమారుగా 5-8 గంటల సమయం పట్టనుంది.
అమర్ నాథ్ యాత్రపై ఉగ్రవాదుల కన్ను పడిందనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కూబింగ్ పెంచారు. దాదాపుగా 80, 000 మంది సైనికులు అమర్ నాథ్ యాత్ర కోసం పహారా కాస్తున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో అమర్ నాథ్ యాత్రా మార్గాలపై నిగా ఉంచుతున్నారు. యాత్రికులందరికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ( ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్ ల ద్వారా ట్రాక్ చేస్తున్నారు. జాగిలాలతో అమర్ నాథ్ యాత్రా మార్గాలను జల్లెడ పడుతున్నారు. యాత్రా మార్గాల్లో ఎలాంటి వాహనం కూడా ఆగకుండా నిషేధం విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. యాత్రికులు తప్పకుండా ఆధార్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లను తీసుకురావాలని అధికారులు ఆదేశించారు.
అనంత్ నాగ్ జిల్లా నున్వాన్ బేస్ నుంచి 48 కిలోమీటర్ల మార్గం, గండెల్బార్ జిల్లా బల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల మార్గాల ద్వారా అమర్ నాథ్ యాత్ర జరగనుంది. దీంతో పాటు ఈ సారి శ్రీనగర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ సదుపాయాన్ని కూడా కల్పించారు. దీని ద్వారా ఒక రోజులోనే యాత్ర చేసే వీలుంది.