ఓ టీవీ డిబెట్ లో పాల్గొంటూ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై దేశంలో, విదేశాల్లో దుమారమే చెలరేగుతోంది. ఇప్పటికే ఖతార్, యూఏఈ, సౌదీ, మలేషియా, ఇరాక్ వంటి దేశాలు భారత్ కు తమ నిరసన తెలిపాయి. భారత విదేశాంగ శాఖ కూడా అంతే స్థాయిలో బదులిచ్చింది. ఇప్పటికే మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని.. వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వానికి ఆపాదించవద్దని హితవు పలికింది.
ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున శుక్రవారం రోజు ముస్లింలు ఆందోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలకు దిగారు. యూపీ, ఢిల్లీ, హైదరాబాద్, రాంచీ ఇలా పలు చోట్ల ఆందోళన నిర్వహించారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ తో పాటు జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ వివాదం ఇలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇస్లాం, ముస్లింలను అపహాస్యం చేయడానికి ఉద్దేశించిన వార్తా చర్చలలో పాల్గొనవద్దని కోరింది. అటువంటి ప్రదర్శనల్లో పాల్గొనడం వల్ల ముస్లింలకు, ఇస్లాంకు ఏ విధంగా సేవ చేయకపోవడమే కాకుండా.. ముస్లింలు, ఇస్లాంలు లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానిచారు. ఈ టీవీ డిబేట్లు నిర్మాణాత్మక చర్చకు ఉపయోగపడేవి కావని..కేవలం ఇస్లాం, ముస్లింలను అపహాస్యం చేయడానికి మాత్రమే అని లా బోర్డ్ అభిప్రాయపడింది.
కేవలం టీవీ డిబేట్లలో న్యూస్ ఛానెల్స్ బ్యాలెన్సుడ్ గా ఉన్నామని చూపడానికి మాత్రేమే ముస్లిం ప్రముఖులను ఆహ్వానిస్తున్నాయని..మనం ఈ మోసానికి బలైపోతున్నామని.. మేము ఈ ప్రోగ్రామ్స్, ఛానెల్స్ ను బహిష్కరిస్తే సదరు టీవీ ఛానెళ్లు టీఆర్పీ కోల్పోవడమే కాకుండా.. వారి ప్రణాళికలు విఫలం అవుతాయని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అభిప్రాయపడింది.