Akhilesh Yadav: మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించినట్లు కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దీంతో పాటు తమ మేనిఫేస్టో అంశాలనే బీజేపీ కాపీ కొట్టిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇదిలా ఉంటే, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీయేలోని మిత్రపక్షాలను అధికారంలో కొనసాగించేలా బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉత్తర్ ప్రదేశ్‌ని విస్మరించారని ఆయన అన్నారు.
Read Also: Sri Lanka: 9 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారంలో ఉండేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎన్డీయే మిత్రపక్షాలను ప్రసన్నం చేసుకునేందుకు బడ్జెట్ ప్రయత్నమని అఖిలేష్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూలు పాలిస్తున్న ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15,000 కోట్లు కేటాయించగా, బీహార్‌లో రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టులకు రూ.26,000 కోట్లు కేటాయించారు. ఉత్తర్ ప్రదేశ్‌కి బడ్జెట్‌లో ఏమీ రాలేదని అఖిలేష్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏం ప్రయోజనం కలగలేదని విమర్శించారు.