Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. మరోసారికి పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నుంచే పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ తెలిపారు. 2019లో బీజేపీ ఈ సీటు గెలిచే వరకు ఎస్పీకి ఈ సీటు నుంచి ఎదురులేదు. ఈ స్థానం నుంచి గురువారం అఖిలేష్ నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది.
Read Also: Boeing 737: టేకాఫ్ సమయంలో ల్యాండిగ్ గేర్ చక్రాన్ని కోల్పోయిన విమానం.. వీడియో వైరల్..
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కలిగిన యూపీలో ఎవరు సత్తా చాటితే వారు ఢిల్లీలో అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువ. గత ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రం నుంచి మెజారిటీ స్థానాలు సాధించింది. ఈ సారి కూడా మొత్తం 80 స్థానాలకు గానూ 70+ గెలుపొందాలని భావిస్తోంది. మరోవైపు ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తులో పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కన్నౌజ్ నుంచి ఎస్పీ అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ మేనల్లుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌ని ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత స్వయంగా అఖిలేష్ పోటీ చేస్తాడనే వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
యూపీలో ఇండియా కూటమికి మంచి భవిష్యత్తు ఉందని, ఈ ఎన్నికల్లో బీజేపీ చరిత్రలో కలిసిపోతుందని ఇటీవల అఖిలేష్ యాదవ్ అన్నారు. కన్నౌజ్ నుంచి తేజ్ ప్రతాప్ పేరు ప్రకటించడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆశ్యర్యం వ్యక్తం చేయడంతో పాటు కొంత అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఒకవేళ అఖిలేష్ ఇక్కడ నుంచి పోటీ చేయకుంటే బీజేపీదే మొగ్గు ఎక్కువగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.