Akhilesh Yadav: నీట్ ఉద్యమం విషయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ల మధ్య విభేదాలు తలెత్తాయి. లోక్‌సభ బయట ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లోక్‌సభలో స్పీకర్ కేసీ వేణుగోపాల్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజులకు మాట్లాడే అవకాశం ఇవ్వడంతో, ‘‘ప్రభుత్వం-కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగిందా.?’’అని స్పీకర్‌ను ప్రశ్నించారు.
బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇవ్వాలని, నీట్ పేపర్ లీక్‌పై చర్చ కోరుతూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ గందరగోళం మధ్య స్పీకర్ ఓం బిర్లా ఇద్దరు నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనిపై అఖిలేష్ మాట్లాడుతూ.. ‘‘ఇది కాంగ్రెస్, ఎస్పీ లేదా బీజేపీకి సంబంధించిన అంశం కాదని, దేశ విద్యార్థులకు సంబంధించిన సమస్య అని, వారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. మాకు ఎందుకు ఇవ్వలేదు? మీ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందా?’’ అని ప్రశ్నించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన అఖిలేష్, విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోతే మరోసారి రోడ్డెక్కుతామని హెచ్చరించారు. పార్లమెంట్‌లో మాకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే ప్రధాని ఇంటి ముందు నిరసనకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. విద్యార్థులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, వారి ఎముకలు విరిగాయని, విద్యార్థినుల దుస్తులు చిరిగిపోయాయని, దేశ యువతకు కేంద్రం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.

