నూతన సంవత్సరంలో మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. నిన్నామొన్నటిదాకా విడివిడిగా ఉన్న అజిత్ పవార్-శరద్ పవార్ కుటుంబాలు మళ్లీ ఒక్కటి కాబోతున్నాయన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు అజిత్ పవార్ తల్లి ఆశాతై రాయబారిగా మారి సయోధ్య కుదిర్చినట్లుగా తెలుస్తోంది. నూతన సంవత్సర వేళ ఆశాతై.. అజిత్ పవార్‌కు ఫోన్ చేసి.. కుటుంబ విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టి కలిసిపోవాలని విజ్ఞప్తి చేసింది. దీంతో ఇరు కుటుంబాలు అంగీకరించడంతో తిరిగి కలిసిపోయేందుకు సిద్ధమైయినట్లు సమాచారం.
ఇక అజిత్ పవార్ తల్లి ఆశాతై మాట్లాడుతూ.. కుటుంబ కలహాలకు ముగింపు పలకాలని పవార్ల కుటుంబాలకు పిలుపునిచ్చారు. కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయని.. తిరిగి ఇరు కుటుంబాలు కలిసి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అజిత్ పవార్-శరద్ పవార్ తిరిగి కలిసి కోవాలని ప్రార్థించానని.. తన ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇరు కుటుంబాల్లో సయోధ్య కుదిరినట్లుగా ఆమె వ్యాఖ్యలతో అర్థమవుతోంది. త్వరలోనే ఇరు కుటుంబాలు కలవబోతున్నట్లు సమాచారం.
డిసెంబరు 12న శరద్ పవార్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఢిల్లీలో ఉన్న శరద్ పవార్ ఇంటికి అనూహ్యంగా అజిత్ పవార వెళ్లారు. బర్త్ డే విషెస్ చెప్పి.. చాలా సేపు ఐక్యంగా కూర్చుని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే ఇరు కుటుంబాల మధ్య సయోధ్య జరిగినట్లుగా సమాచారం. దీంతో కొత్త సంవత్సరం వేళ్ల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
శరద్ పవార్ తండ్రితో సమానమని ఎన్‌సీపీ సీనియర్ నాయకుడు ప్రపుల్ పటేల్ అన్నారు. రాజకీయాలు భిన్నమైనప్పటికీ.. ఆయనంటే అపారమైన గౌరవం ఉందని చెప్పారు. పవార్ కుటుంబం తిరిగి కలిస్తే చాలా సంతోషిస్తామని చెప్పారు. పవార్ కుటుంబంలో తాను కూడా ఒక భాగమని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇరు కుటుంబాల కలయికపై కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2023లో అజిత్ పవార్.. ఎన్సీపీలోని కొంత మంది ఎమ్మెల్యేలను తీసుకుని… శివసేన-బీజేపీ కూటమిలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహాయుతితో కలిసే పోటీ చేశారు. అయితే ఈ మధ్య మహాయుతిలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇందులో భాగంగానే తిరిగి ఎన్సీపీ నేతలంతా ఒక్కటి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒక తల్లి చేసిన ప్రయత్నంతో రెండు కుటుంబాలు ఒక్కటి కాబోతుండడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.