NTV Telugu Site icon

Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..

Uddhav Thackeray

Uddhav Thackeray

Uddhav Thackeray: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అభ్యంతరం చెప్పారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఈ వ్యాఖ్యల్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు ఎక్కుపెడుతోంది. బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’లో ఐక్యత లేదని ఈ వ్యాఖ్యలే నిదర్శనమని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కొద్ది నెలల క్రితం సింధుదుర్గ్‌లో కూలిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఘటనను ప్రస్తావిస్తూ.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైందిగా ఆరోపించారు.

Read Also: Election Commission: ఎన్నికల ప్రచారంలో మహిళలపై అనుచిత పదజాలం చేస్తే ఊరుకోం..

బుల్దానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘యోగి వ్యాఖ్యల్ని అజిత్ పవార్ అంగీకరించకపోవడం, ఆ కూటమిలో ఐక్యత లేదని తెలియజేస్తోంది. యూపీ ముఖ్యమంత్రి నుంచి మహారాష్ట్ర ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో యోగి ‘‘బాటేంగేతో కటేంగే’’ నినాదాన్ని తీసుకువచ్చారు. అయితే, ఈ నినాదంపై అజిత్ పవార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలు ఇలాంటి వ్యాఖ్యల్ని హర్షించరని, రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ మత సామరస్యాన్ని కొనసాగించడానికి కృషి చేస్తున్నారని అన్నారు.

ఎన్నికల ముందు ప్రచారానికి రాష్ట్రం బయట నుంచి నేతల్ని తీసుకురావడంపై బీజేపీపై ఠాక్రే మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రేమించే వారికి, ద్వేషించే వారికి మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతీ జిల్లాలో శివాజీ మహరాజ్ ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. మహిళల్ని ఎలా గౌరవించాలనే బోధనల్ని హైలెట్ చేస్తామని చెప్పారు.

Show comments