Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం కుప్పకూలింది. విమానం వేగంగా తన ఎత్తును కోల్పోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదం సమయంలో విమానం 825 అడుగుల నుంచి కుప్పకూలింది. విమానం నేలను ఢీ కొట్టడంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
అయితే, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే పైలట్లు అత్యవసర సందేశం ‘‘మేడే మేడే’’ అని అహ్మదాబాద్ ఏటీసీని మేసేజ్ పంపించారు. ఇది జరిగిన తర్వాత రేడియో ఆఫ్ అయిపోయింది. కో-పైలెట్ ఏటీసీకి మేడే కాల్ చేశారని, కానీ ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదని పౌర విమానయాన డైరెక్టరేట్ (DGCA) ధృవీకరించింది.
Read Also: Air India Plane Crash: 100 మందికి పైగా మృతి.? టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే సిగ్నల్ లాస్ట్..
“విమానంలో 242 మంది ఉన్నారు, వీరిలో 2 పైలట్లు మరియు 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్‌గా సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్ కుందర్ ఉన్నారు కెప్టెన్ సుమీత్ సభర్వాల్ 8200 గంటల అనుభవం కలిగిన ఉన్నారు. కోపైలట్‌కు 1100 గంటల విమానయాన అనుభవం ఉంది. ఏటీసీ ప్రకారం, విమానం అహ్మదాబాద్ నుండి సమయం1339 IST (0809 UTC) వద్ద రన్‌వే 23 నుండి బయలుదేరింది” అని ప్రకటనలో పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి సమీక్షించారు. అవసరమైన అన్ని సహాయాన్ని వెంటనే అందించాలని మరియు పరిస్థితిపై క్రమం తప్పకుండా నవీకరించాలని మంత్రిని కోరారు. మరోవైపు, అహ్మదాబాద్ ఎయిర్ పోర్టును మూసేశారు.