Air India Flight: ఎయిర్ ఇండియా విమానం ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. 270 మంది ప్రాణాలను తీసిన ఈ ఘోర దుర్ఘనటలో ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్‌కు వెళ్లాల్సిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లలోనే కుప్పకూలింది. కేవలం విమానంలో ఉన్న ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడు.
ఇంజన్లకు నిలిచిన ఇంధన సరఫరా:
ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు నివేదిక పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. బ్లాక్ బాక్స్ డేటాను డీకోడ్ చేయగా పలు అంశాలు వెల్లడయ్యాయి. విమానం ముందుగా సాధారణంగా టేకాఫ్ అయినట్లే తేలింది. విమానం ముందుగా 283 కి.మీ/ గంట వేగంతో టేకాఫ్ అయింది, గాలిలోకి 333 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఫ్లాప్ సెట్టింగ్ 5 డిగ్రీల వద్ద ఉంది, ల్యాండింగ్ గేర్ కిందకు ఉంది. ఇదంతా సాధారణ టేకాఫ్‌నే సూచిస్తుంది. వాతావరణ పరిస్థితులు కూడా చక్కగా ఉన్నాయి.
అయినప్పటికీ, సెకన్ల వ్యవధిలో ఇంజన్ 1, ఇంజన్ 2 ఫ్యూయర్ కంట్రోల్ స్విచ్‌లు “RUN” నుండి “CUTOFF”కి మారాయి. సెకన్ల వ్యవధిలో రెండు ఇంజన్లకు ఇంధనం నిలిచిపోయింది. సాధారణంగా కట్ఆప్ అనేది ఇంజన్లకు ఇంధనాన్ని నిలిపివేయడాన్ని సూచిస్తుంది. దీంతో ఇంజన్లు శక్తిని కోల్పోయి, క్రమంగా విమానం కూలిపోవడం ప్రారంభమైంది. ఇది వేగవంతమైన డీ-థ్రోట్లింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు సూచిస్తుంది.
కాక్‌పిట్‌లో గందరగోళం:
క్షణాల వ్యవధిలో విమానంలోని పరిస్థితులు కాక్‌పిట్‌లో గందరగోళానికి కారణమయ్యాయి. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR), పైలట్ల మధ్య సంభాషణల్ని రికార్డ్ చేసింది. ఇంజన్లకు ఇంధనాన్ని ఎందుకు నిలిపేశామని ఒక పైలట్ అడగగా, నేను ఏం చేయలేదని మరో పైలట్ చెప్పడం రికార్డ్ అయింది. అయితే, ఈ చర్యకు కారణాలు ఏంటనేది ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. సాధారణంగా బోయింగ్ 787 ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఆఫ్ కావు. దీనిని మార్చాలంటే పైలట్ రన్, నుంచి కట్ ఆఫ్‌కు మార్చాల్సి ఉంటుంది.
ఇంజన్ 1, ఇంజన్ 2 కోసం స్విచ్‌లు దాదాపుగా 2-3 అంగుళాల దూరంలో ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా మార్చితే తప్పా, ఇంధనాన్ని నియంత్రించడం సాధ్యం కాదని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. కానీ, సెకన్ల వ్యవధిలోనే కట్ ఆఫ్ అవ్వడం అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.
పైలట్లు ప్రయత్నించినా ప్రమాదం తప్పలేదు:
థ్రస్ట్ తగ్గడం, విమానం వేగంగా కిందకు వెళ్తుండటంతో పైలట్లు విమానాన్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లు బ్లాక్ బాక్స్ సూచిస్తోంది. కట్ ఆఫ్ నుంచి రన్‌కి మార్చడానికి పైలట్లు ప్రయత్నించారు. అయితే, 10 సెకన్లలో ఇంజన్లు రీస్టార్ట్ అయ్యేందుకు సమయం తీసుకుంది. ఇంజన్ 1 తిరిగి ప్రారంభమైంది, కానీ కోర్ వేగం తగ్గింపు ఆగిపోయింది. ఇంజన్ 2 కూడా తిరిగి ప్రారంభమైంది, కానీ అనుకున్నంత వేగంగా స్పందిచంలేదు. సరైన ఎత్తు, సమయం లేకపోవడంతో ఇంజన్ల ప్రతిస్పందన సరిపోలేదు. ఇదే సమయంలో ఇంజన్ వైఫల్యం కావడంతో చిన్న ప్రొపెల్లర్ అయిన రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) టేకాఫ్ సమయంలో ఫ్యూజ్‌లేజ్ నుంచి బయటకు వచ్చింది.