AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్నాడీఎంకే పార్టీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు, పార్టీ నుంచి బహిష్కరించబడిన నేతలు ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్), టీటీవీ దినకరన్‌లు మళ్లీ ఎన్డీయే గూటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంకేకు వ్యతిరేకంగా సాంప్రదాయ అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్ చీలిపోకుండా ఉండేందుకు తెర వెనక బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Read Also: Redfort : ఎర్రకోటలో ‘షాజహాన్’.. నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులకు ఘన స్వాగతం
అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కే పళని స్వామి(ఈపీఎస్) ఈ ఇద్దరు నేతల్ని నేరుగా తన పార్టీలోకి తీసుకోకపోయినా, ఎన్డీయే కూటమిలోకి తిరిగి రావడానికి బీజేపీ అనుమతిస్తోందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత మరణించిన తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. ఈసారి మాత్రం విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు, తమిళనాడులో ఎన్డీయే పొత్తులపై ఈపీఎస్ కు సంపూర్ణ అధికారం ఉంది. ఈ అధికారాన్ని జనరల్ కౌన్సిల్ ఆయనకు కట్టబెట్టింది. ఉమ్మడి ప్రత్యర్థి అయిన డీఎంకేను ఓడించేందుకు భావసారూప్య పార్టీలు ఎన్డీయేలో చేరుతాయని ఇటీవల జనరల్ కౌన్సిల్ ఒక హింట్ ఇచ్చింది. ఇది ఓపీఎస్, దినకరన్ గురించే అని అంతా అనుకుంటున్నారు.
అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన సీనియర్ నేత సెంగొట్టయన్.. శశికళ, ఓపీఎస్, దినకర్‌లను పార్టీలో చేర్చుకోవాలని గతంలో కోరారు. ఈ వ్యాఖ్యల తర్వాత పార్టీ ఆయనను బహిష్కరించింది. ఇప్పుడు ఆయన విజయ్ పార్టీ టీవీకేలో చేరారు. జయలలిత మరణం తర్వాత శశికళను పార్టీ నుంచి తొలగించిన తర్వాత దినకరన్, ఈపీఎస్‌ను ద్రోహిగా అభివర్ణించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కూడా ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు, దక్షిణ తమిళనాడులో ఆధిపత్య తేవర్ కుల మద్దతు పొందాలంటే ఇద్దరు నాయకులు కీలకంగా మారారు. దీంతో ఇప్పుడు వీరిద్దరిని ఎన్డీయేలోకి చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
