Maharashtra: మహరాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను నమోదు చేసిన కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘మహా వికాస్ అఘాడీ‘ కూటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మ్యాజిక్ రిపీట్ చేయాలని అనుకుంటోంది. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు పొత్తు ఖరారు చేసుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతర నేతలతో ఠాక్రే రేపు సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర ఇండియా కూటమిలోని పార్టీలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇదే మొదటి సమావేశం.
Read Also: Droupadi murmu: రాష్ట్రపతికి అరుదైన గౌరవం.. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం
శివసేనతో సమావేశానికి ముందు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలు రేపు అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పొత్తు చర్చల కోసం ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ఢిల్లీలోనే ఉన్నారు. నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి చర్చ జరుగుతోందని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకురావాలని అనుకుంటున్నామని ఆదిత్య ఠాక్రే అన్నారు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ నెలలో ఎన్నికలు జరగే అవకాశం ఉంది. లోక్‌సభ ఫలితాలను రిపీట్ చేయాలని ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆశిస్తోంది. 2019లో బీజేపీ-శివసేన(అవిభక్త) కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తే మొత్తం 48 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ 23, శివసేన 18 స్థానాలను గెలుచుకుంది. అయితే, 2024 ఎన్నికల్లో మాత్రం 48 స్థానాల్లో బీజేపీ కూటమి 09 స్థానాలను గెలుచుకుంది, శివసేన(షిండే)-07, ఎన్సీపీ(అజిత్ పవార్)-01 సీట్లను గెలుచుకున్నారు. ఇక ఇండియా కూటమి ఏకంగా 29 స్థానాలను కైవసం చేసుకుంది.