NTV Telugu Site icon

PM Modi: ‘‘ఐక్యంగా ఉంటేనే సురక్షితం’’.. కాంగ్రెస్‌పై పీఎం మోడీ ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ధులేలో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తద్వారా ప్రతీ సామాజిక వర్గం అభివృద్ధి చెందే అవకాశాలను దెబ్బతీస్తోందని ప్రధాని పేర్కొన్నారు. “ఏక్ హైన్ టు సేఫ్ హైన్ (మీరు ఐక్యంగా ఉంటే మీరు సురక్షితం)” అని నినాదమిచ్చారు. మహాయుతి కూటమిని మళ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు.

Read Also: Putin: గ్లోబల్ సూపర్ పవర్స్‌లో భారత్‌కు అర్హత ఉంది..

కాంగ్రెస్ ఒక కులాన్ని మరో కులంపై రెచ్చగొట్టే ఆట ఆడుతోందని, దళితులు వెనకబడిన తరగతులు, గిరిజన వర్గాల జీవితాలు అభివృద్ధి చెందడం కాంగ్రెస్‌కి ఇష్టం ఉండదని ప్రధాని మోడీ అన్నారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని బిజెపి, శివసేన, ఎన్‌సిపి వర్గాలతో కూడిన మహాయుతి మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధికి హామీ ఇవ్వగలదని, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఇప్పటికే ఉన్న సంక్షేమ చర్యలు,పథకాలను రద్దు చేస్తుందని మోడీ ప్రకటించారు.

మహాయుతికి ఓటేయాలని, తద్వారా రాబోయే ఐదేళ్లలో మహారాష్ట్రని కొత్త శిఖరాలకు తీసుకెళ్తామని, రాష్ట్రంలో సుపరిపాలన మహాయుతి ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమని ప్రధాని అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమి బండికి చక్రాలు లేవు, బ్రేకులు లేవు డ్రైవర్ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయి అని ప్రధాని విమర్శించారు. మహారాష్ట్రలో నవంబర్ 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.