Ahead Of Gujarat Elections, Another Congress MLA Joins BJP: గుజరాత్ లో బీజేపీ అధికారానికి గండికొడదాం అని అనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి భారీ షాకులు తగులుతున్నాయి. వరసగా రెండు రోజుల్లో వ్యవధిలో ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేతలు బీజేపీ పార్టీలో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే భగవాన్ బరాద్ బుధవారం శాసన సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈయన బీజేపీ పార్టీలో చేరనున్నారు. గిర్ సోమనాథ్ జిల్లాలోని తలాలా స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బరాద్ తన రాజీనామా లేఖను గుజరాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ కు పంపారు. స్పీకర్ నిమాబెన్ ఆచార్యకు తన ఎమ్మెల్యే రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈయన రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకినట్లు అయింది. తన మద్దతుదారుల నిర్ణయం ప్రకారమే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే టికెట్ పొందేందుకు ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Read Also: Uttarakhand: లెహంగా నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. ట్విస్టుల మీద ట్విస్టులు
దీనికి ఒక రోజు ముందు మంగళవారం సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, గిరిజన నాయకుడు మోహన్ సింగ్ రత్వా కూడా తన శాసనసభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రత్వా పదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం గుజరాత్ లోని ఛోటా ఉదయ్ పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రత్వా తన కుమారుడు రాజేంద్ర సింగ్ రత్వాను పోటీలో దింపనున్నట్లు ప్రకటించారు. ఇలా వరసగా రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు విడతల్లో డిసెంబర్ 1, డిసెంబర్ 5న పోలింగ్ జరపనున్నారు. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటించనున్నారు. గత 25 ఏళ్ల నుంచి బీజేపీ గుజారాత్ రాష్ట్రంలో తన ఆధిక్యతను నిలుపుకుంటోంది. ప్రతీ ఎన్నికల్లో వరసగా విజయాలు సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అధికారంలోకి రాలేకపోతోంది. ఈ సారి ఆప్ కూడా రంగంలోకి దిగింది. దీంతో గుజరాత్ లో త్రిముఖ పోరు నెలకొంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లను గెలుచుకుంటే.. కాంగ్రెస్ పార్టీ 77 సీట్లను గెలుచుకుంది.
