NTV Telugu Site icon

Congress: రాజస్థాన్ సంక్షోభంపై కాంగ్రెస్ కీలక సమావేశం.. గెహ్లాట్, పైలెట్ మధ్య సఖ్యత కుదిరేనా..?

Congrss

Congrss

Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. సీఎం అశోక్ గెహ్లాట్, యువనేత సచిన్ పైలెట్ మధ్య విభేదాలు మాత్రం సమసిపోవడం లేదు. స్వపక్షంలోనే ఉంటూ విపక్షాల్లా విమర్శించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ రోజు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ని అధిష్టానం ఢిల్లీకి పిలిచింది. గెహ్లాట్ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.

ఈ ఇద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ధీ ఇటు గెహ్లాట్ వర్గం, అటు పైలెట్ వర్గం ఏ మాత్రం తగ్గడం లేదు. మూడేళ్ల క్రితం సచిన్ పైలెట్ చేసిన తిరుగుబాటు విఫలం అయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పడటం లేదు. అయితే ప్రస్తుతం గెహ్లాట్ ను పిలిచిన అధిష్టానం, త్వరలో పైలెట్ ను పిలిచి చర్చిస్తారని తెలుస్తోంది. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలను పరిష్కరించి, ఇద్దరు కలిసి పనిచేసేలా చేసి కర్ణాటకలో భారీ విజయాన్ని సాధించింది కాంగ్రెస్. అదే ఫార్ములాను ఇక్కడ కూడా వర్తింపచేయాలని చూస్తున్నాడు.

Read Also: Raghunandan Rao : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు లీగల్ నోటీసు.. రూ.1000కోట్లకు పరువునష్టం దావా

గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి పైలెట్ ఎక్కువగా కృషి చేశాడు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించారు. కానీ అధిష్టానం మాత్రం అశోక్ గెహ్లాట్ ను సీఎంగా చేసింది. అప్పటి నుంచి పైలెట్, అతని వర్గంలో అసంతృప్తి ఉంది. ప్రస్తుతం పైలెట్ బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీక్ స్కామ్ పై చర్యలు తీసుకోవాలని సీఎం గెహ్లాట్ ను డిమాండ్ చేస్తున్నాడు. ఈ నెలాఖరులోగా చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని అల్టిమెటం జారీ చేశారు. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా జన్ సంఘర్ష్ యాత్ర చేపట్టారు పైలెట్.

2018 ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73 స్థానాల్లో గెలిచింది. రాజస్థాన్లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 2 సార్లు గెలిచింది లేదు. ప్రతీ సారి రాజస్థాన్ ఓటర్లు ప్రభుత్వాన్ని మారుస్తుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. వరసగా రెండోసారి గెలుద్దాం అని అనుకుంటున్న కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి.