వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ… పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి,భారత ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చేసింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పై స్వయంగా ప్రధానమంత్రి, తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. రైతు ప్రతినిధుల్లో ఎస్‌కేఎంల ప్రతినిధులను కూడా చేర్చుకుంటామని స్పష్టం చేసింది. అలాగే దేశంలోని రైతులకు ఎంఎస్‌పి ఇవ్వాలన్నది కమిటీ ప్రతిపాదనల్లో ఒకటి. రైతుల ఆందోళనకు సంబంధించిన కేసుల విషయానికొస్తే, యుపి, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు ఆందోళనకు సంబంధించిన అన్ని కేసులను తక్షణమే ఉపసంహరించుకుంటామని అంగీకారం తెలిపింది.
కిసాన్ ఆందోళన సందర్భంగా ఢిల్లీతో సహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆందోళనకారులు, మద్దతుదారులపై నమోదైన అన్ని కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని పేర్కొంది. ఈ రైతు ఉద్యమానికి సంబంధించిన అన్ని కేసులను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అలాగే పరిహారం విషయానికొస్తే, దీనికి కూడా హర్యానా, యు.పి. ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. పంజాబ్ ప్రభుత్వం కూడా పై రెండు అంశాలకు సంబంధించి బహిరంగ ప్రకటన చేసింది.
“విద్యుత్ బిల్లు”లో రైతును ప్రభావితం చేసే నిబంధనలపై సంబంధిత వాటాదారులతో, “సంయుక్త కిసాన్ మోర్చా”తో చర్చలు జరుపుతాం. మోర్చాతో చర్చించిన తర్వాతే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు అని ప్రకటించింది. ఇక పంట వ్యర్థాల సమస్య విషయానికొస్తే, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టం సెక్షన్ 14 మరియు 15లో రైతుకు మినహాయింపునిచ్చింది.