NTV Telugu Site icon

Taj Mahal: తాజ్‌మహల్‌కు తొలిసారిగా ఇంటి పన్ను నోటీసులు.. రూ.1.4 లక్షలు కట్టాలని ఆదేశం

Taj Mahal

Taj Mahal

Taj Mahal: ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి నోటీసులు జారీ చేశారు. తాజ్‌మహల్‌పై బకాయి ఉన్న రూ.1.4 లక్షల ఇంటి పన్ను చెల్లించాలని గత నెలలో నోటీసు జారీ చేసినప్పటికీ అది కొద్ది రోజుల క్రితమే అందింది. బకాయిలను క్లియర్ చేయడానికి ASIకి 15 రోజుల గడువు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా పన్నును క్లియర్ చేయకుంటే తాజ్‌మహల్‌ను అటాచ్‌ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంటి పన్ను మొత్తంలో బకాయిపై వడ్డీగా రూ.47వేలను కూడా చేర్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి ఇంటి పన్ను రూ.11,098 అని వివరించారు.

Read Also: CM Jagan: నాటా తెలుగు సభలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

అయితే మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ హయాం నుంచి ఇప్పటివరకు పన్ను కట్టమని నోటీసులు పంపలేదని ఇదే మొదటిసారని వాపోతున్నారు. తాజ్‌మహల్‌ను రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారని.. అందుకే ఈ పన్నును విధించారేమోనని ఏఎస్‌ఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఆగ్రాలోని మొఘల్ సమాధి అయిన ‘టోంబ్ ఆఫ్ ఇత్మాద్-ఉద్-దౌలా’పై కూడా ఇంటి పన్ను బకాయి చెల్లించేందుకు ఇదే నోటీసు వచ్చిందని, ఇది కూడా రక్షిత స్మారక చిహ్నంగా ఉందని అధికారులు వివరించారు. ఈ సమాధిని ‘బేబీ తాజ్’ అని కూడా పిలుస్తారు. ఈ సమాధిని మొఘల్ చక్రవర్తి జహంగీర్ భార్య నూర్జహాన్ తన తండ్రి కోసం నిర్మించారు. కాగా జాతీయ స్మారక చిహ్నాలపై ఎలాంటి పన్ను విధించడానికి వీల్లేదని.. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ పొరపాటుగా ఈ నోటీసులు పంపి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఓ ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు చెప్తున్నారు.

Show comments