Site icon NTV Telugu

Congress: ‘‘మాధురి దీక్షిత్ సెకండ్ గ్రేడ్ యాక్టర్’’.. రోహిత్ శర్మ తర్వాత మరో వివాదంలో కాంగ్రెస్..

Tikaram Jully

Tikaram Jully

Congress: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌కి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మని ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ నేత షామా మహ్మద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌ని ఉద్దేశిస్తూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత భారత అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో ఆమె చేసిన ట్వీట్‌ని తొలగించింది. ఫైనల్‌లో రోహిత్ శర్మ చెలరేగి ఆడటంతో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. దీని తర్వాత నెటిజన్లు షామా మహ్మద్‌పై ట్రోలింగ్ చేశారు.

ఈ ఘటన మరవక ముందే, మరో కాంగ్రెస్ నేత బాలీవుడ్ స్టార్ యాక్టర్ మాధురీ దీక్షిత్‌ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత టికారం జుల్లీ మాట్లాడుతూ.. ‘‘మాధురీ దీక్షిత్ సెకండ్ గ్రేడ్ యాక్టర్’’ అని అనడం వివాదాస్పదమైంది. బుధవారం రాజస్థాన్ అసెంబ్లీలో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(IIFA) అవార్డులలో తక్కువ మంది బాలీవుడ్ తారలు ఉండటాన్ని విమర్శించారు. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందని ప్రశ్నించారు.

Read Also: Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..

‘‘ఈ కార్యక్రమం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలిగింది..? ఎంత మంది పెద్ద స్టార్లు హాజరయ్యారు..? వారు ఏవైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్లారా..? వారు ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్లలేదు. షారూఖ్ ఖాన్ తప్ప, అందరూ సెకండ్ గ్రేడ్ యాక్టర్స్. ఫస్ట్ గ్రేడ్ యాక్టర్లు ఎవరూ హాజరు కాలేదు’’ అని టికారం జుల్లీ అన్నారు. ‘‘ మాధురీ దీక్షిత్ ఇప్పుడు సెకండ్ గ్రేడ్ యాక్టర్. ఆమె సమయం అయిపోయింది. దిల్, బేటా వంటి సినిమాల్లో ఆమె పెద్ద స్టార్. పెద్ద స్టార్లు ఈ కార్యక్రమానికి రాలేదు. అమితాబ్ బచ్చన్ వంటి వారు రాకపోతే , మరి ఎవరు వచ్చారు..?’’ అని ప్రశ్నించారు.

జైపూర్‌లో జరిగిన IIFA 2025 అవార్డులకు అనేక మంది ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, కరీనా కపూర్ ఖాన్, షాహిద్ కపూర్, కార్తీక్ ఆర్యన్, కత్రినా కైఫ్, మరియు ప్రముఖ నటి రేఖ హాజరయ్యారు. స్టార్లు రాలేదనే వాదనల్ని అధికార బీజేపీ తిప్పికొట్టింది.

Exit mobile version