NTV Telugu Site icon

BJP: ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు.. ఇందిరా గాంధీ హత్యని మరిచిపోయారా..?

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: లోక్‌సభ వేదికగా ఖలిస్తానీ మద్దతుదారు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మద్దతు ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఖలిస్తాన్‌కి మద్దతు ఇస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అమృత్‌పాల్‌ని జాతీయ భద్రతా చట్టాల కింద అరెస్ట్ చేశారు. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా గెలిచారు. అయితే, అతడిని కటకటాల వెనక ఉంచడం ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’ అని చన్నీ లోక్‌సభలో వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వ్యాఖ్యల్ని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించినప్పటికీ వివాదం ముగియలేదు.

Read Also: BJP MP Nishikant Dubey: ఆ ప్రాంతాలను యూటీగా చేయడం లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు..

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైనప్పటికీ, కాంగ్రెస్ ఖలిస్తానీ సానుభూతిపరులకు మద్దతు ఇవ్వడం ప్రారంభించిందా..? అని బీజేపీ ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సోషల్ మీడియాలో కాంగ్రెస్ తీరును తూర్పారపట్టారు. ‘‘ కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చన్నీ ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌‌కి మద్దతు ఇచ్చారు. ఇది జై సంవిధానమా..? భారత్ ముక్కలు ముక్కలు కావాలని కోరుకునే వేర్పాటువాదుల కోసం మద్దతు ఇస్తున్నారా..? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. మాజీ ప్రధాని ఇందిరా జీ హత్యకు కారణమైన ఖలిస్తాన్ ఆలోచన, ఉగ్రవాదుల కోసం ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుంది. 26/11 జిహాదీలు, ఇప్పుడు ఖలిస్తానీ టెర్రరిస్టులకు కాంగ్రెస్ సపోర్టు ఎందుకు..?’’ అని ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు.

చన్నీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ దూరంగా ఉన్నప్పటికీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమృత్‌పాల్ సింగ్‌పై చన్నీ అభిప్రాయం అతడి వ్యక్తిగతమని, ఇది కాంగ్రెస్‌కి సంబంధం లేదని పార్టీ మీడియా ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ చన్నీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. చన్నీని కాంగ్రెస్ బహిష్కరించాలని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ డిమాండ్ చేశారు. చన్నీ కెనడా నుంచి దేశవ్యతిరేక శక్తులు ఇచ్చే ఆదేశానుసారం పనిచేస్తున్నారని ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోకుంటే, వారితో కాంగ్రెస్ కుమక్మైందని అర్థమని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు.