Site icon NTV Telugu

Afghanistan: పాకిస్తాన్‌కు షాక్.. భారత్‌లో మరో తాలిబాన్ మంత్రి పర్యటన..

Afghanistan

Afghanistan

Afghanistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఈ పరిణామాలను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. భారత్ పర్యటను ముత్తాఖీ వచ్చిన రోజే కాబూల్‌పై వైమానికి దాడికి తెగబడింది.

ఇదిలా ఉంటే, ఇప్పుడు తాలిబాన్ మరో మంత్రి భారత పర్యటనకు వచ్చారు. ఆప్ఘనిస్తాన్ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ రోజుల పర్యటన కోసం బుధవారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటన తర్వాత భారత్, తాలిబాన్ మధ్య బలమైన దౌత్య, ఆర్థిక ఒప్పందాల్లో ఒకటిగా ఉండబోతోంది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో, సరిహద్దుల్ని పదే పదే మూసేయడంతో ఆఫ్ఘానిస్తాన్‌పై వాణిజ్య ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య సంబంధాలు ఈ సమస్కు పరిష్కారంగా ఉంటాయని తాలిబాన్లు భావిస్తున్నారు.

Read Also: Defence Deal: భారతదేశానికి అమెరికా ఆయుధాలు.. $93 మిలియన్ల డీల్‌కు ఆమోదం..

కాబూల్ నుంచి వచ్చిన మంత్రిని నిన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (PAI డివిజన్) ఆనంద్ ప్రకాష్ విమానాశ్రయంలో స్వాగతించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మెరుగుపరచడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆఫ్ఘాన్ డ్రై ఫ్రూట్స్, కార్పెట్స్, రత్నాలు, హస్తకళల రంగాలను భారత మార్కెట్ లోకి విస్తరించాలని తాలిబాన్ ప్రభుత్వం భావిస్తోంది. పాకిస్తాన్ ను తప్పించి ప్రత్యామ్నాయ వాణిజ్య కారిడార్‌ను ఏర్పాటు చేయాలని రెండు దేశాలు భావిస్తున్నాయి.

భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ యొక్క అతి ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉంది, ఔషధాలు, వస్త్రాలు, యంత్రాలు, టీ, చక్కెర, బియ్యాన్ని ఎగుమతి చేస్తూనే, ఆఫ్ఘన్ వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆఫ్ఘాన్ మైనింగ్, జల విద్యుత్ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. భారత్ కాబూల్ లో పూర్తిస్థాయి రాయబార కార్యాలయాన్ని అక్టోబర్ 2025లో ప్రారంభించింది. ఇప్పుడు అజీజీ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్లో మరో కీలక పరిణామంగా చూడవచ్చు.

Exit mobile version