India-Afghanistan: భారతదేశంలో, ఆఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ పర్యటిస్తున్నారు. తాలిబాన్లు 2021లో ఆఫ్ఘాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, భారత్‌లో ఒక తాలిబాన్ మంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయాల కారణంగా ఆఫ్ఘాన్‌తో సత్సంబంధాలు భారత్‌కు ఇప్పుడు కీలకం. ఈ నేపథ్యంలోనే భారత్-ఆఫ్ఘాన్ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇరు దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇండియాలో పర్యటిస్తున్న ముత్తాకీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌తో కూడా సమావేశం కానున్నారు.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాలను పాకిస్తాన్ నిశితంగా గమనిస్తోంది. తాజాగా, భారత్ దాయాది దేశానికి క్లియర్ మెసేజ్ ఇచ్చింది. విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఆఫ్ఘానిస్తాన్ తమ పొరుగున దేశం’’ అని ముత్తాకీతో కలిసి సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. నిజానికి, భారత్-ఆఫ్ఘనిస్తాన్ 106 కి.మీ ఇరుకైన భూ సరిహద్దును పంచుకుంటున్నాయి. దీనిని ‘‘వఖాన్ కారిడార్’’గా పిలుస్తారు. సాంకేతికంగా భారత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని గిల్గిత్ బాల్టిస్తాన్, ఈ వఖాన్ కారిడార్‌తో సరిహద్దును కలిగి ఉంది. అయితే, ఈ ప్రాంతం, పాకిస్తాన్ ఆక్రమణ చెరలో ఉంది. దీనినే మనం ‘‘పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)’’గా వ్యవహరిస్తున్నాం.
Read Also: Bengaluru: “సొంత దేశంలో రక్షణ లేదు”.. కన్నడలో తిడుతూ ఈశాన్య మహిళకు వేధింపులు..
జైశంకర్ ఆఫ్ఘాన్‌ను పొరుగుదేశంగా అభివర్ణించడం, పీఓకేపై పాకిస్తాన్‌కు భారత్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు అయింది. ఈ సమావేశంలో తర్వాత సంయుక్త ప్రకటనలో, భారత్ ఆఫ్ఘానిస్తాన్‌లు రెండూ సరిహద్దు ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నేరుగా పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని జైశంకర్ చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పాక్ సైనిక చర్యల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
ఢిల్లీలో జైశంకర్-ముత్తాకీ సమావేశానికి కొన్ని గంటల ముందు పాకిస్తాన్, కాబూల్‌పై దాడి చేసింది. మరోవైపు, భారత్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘాన్ భూభాగం ఎలాంటి ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని ముత్తాకీ అన్నారు. ఆగస్టులో 2,000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న భూకంపం మరియు భారతదేశం కోవిడ్ వ్యాక్సిన్లను పంపిన మహమ్మారి వంటి కీలక సమయాల్లో భారతదేశం అందించిన మద్దతును ఆయన ప్రశంసించారు. ఆఫ్ఘాన్, భారత్‌ను మిత్రుడిగా చూస్తోందని, రెండు దేశాల ప్రజలు మంచి సంబంధాలను కోరుకుంటున్నారని, దీనికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
