Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. రూ. 100 కోట్ల విలువైన పోంజీ స్కీమ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణకు పిలిచింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం.. నవంబర్ 20న తిరుచురాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెల్లర్స్‌కి చెందిన భాగస్వామ్య సంస్థలకు సంబంధించిన ఆస్తులపై దర్యాప్తు సంస్థ సోదాలు అనుసరించి సమన్లు వచ్చాయి.
ప్రణవ్ జ్యువెల్లర్స్ రూపొందించిన బోగస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌పై దర్యాప్తులో భాగంగానే ప్రకాష్ రాజ్‌కి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రణవ్ జ్యువెల్లర్స్‌కి ప్రకాష్ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వచ్చే వారం చెన్నైలోని ఈడీ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Read Also: Israel-Hamas War: ఉత్తర గాజాపై హమాస్ నియంత్రణ కోల్పోయింది.. ప్రజలకు ఇజ్రాయిల్ వార్నింగ్..
ఈ కేసులో ఇప్పటి వరకు 11.60 కిలోల బంగారు ఆభరణాలతో పాటు రూ. 23.70 లక్షల విలువైన పలు నేరారోపిత పత్రాలు, లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రణవ్ జువెల్లర్స్ నిర్వహించిన పొంజీ పథకం ద్వారా ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు తిరుచ్చిలోని ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది.
ప్రణవ్ జ్యువెల్లర్స్ లాభాలు వస్తాయని బంగారు పెట్టుబడి పథకం పేరుతో ప్రజల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేసింది. అయితే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమూంది. పెట్టుబడిదారుల్ని మోసం చేసింది.