కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండేకే అధ్యక్షుడు విజయకాంత్ కుడి కాలి వేళ్లలో మూడింటిని వైద్యులు తొలగించారు. మధుమేహం కారణంగా ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్లు డీఎండీకే పార్టీ కార్యాలయం తరఫున మంగళవారం ఓ ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఆయన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. విషయం తెలిసిన సీఎం ఎంకే స్టాలిన్.. తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తమిళ చిత్రసీమలోని ప్రముఖ నటుల్లో ఒకరైన విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టి 2005లో దేశీయ ముర్‌పొక్కు ద్రవిడ కళగమ్ (డీఎండీకే) పార్టీ స్థాపించారు. ప్రజల్లో ఆయన పార్టీకి ఆదరణ పెరిగింది. అయితే, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పేలవ ప్రదర్శన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పార్టీ ప్రాముఖ్యత క్రమంగా తగ్గింది. ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమాల్లో కానీ ఆయన చురుకైన పాత్ర పోషించడం లేదు. కొన్ని సందర్భాల్లో తప్పితే బహిరంగంగా కనిపించడం కూడా తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రేమలత, బావమరిది సుధీష్‌లు పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు.
కెప్టెన్ విజయకాంత్‌గా తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ ఆయన సుపరిచితుడే. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇకపొతే విజయకాంత్ గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. సర్జరీల మీద సర్జరీలు చేస్తూ ఉన్నారు వైద్యులు.. అయినా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆయనను బయట చూసి ఎన్నో ఏళ్ళు అయిపోతుంది. గతంలో ఒక సర్జరీ చేయించుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విజయకాంత్ కు మరో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Vijaya Kanth: కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యం విషమం.. ట్వీట్ చేసిన రజినీకాంత్