NTV Telugu Site icon

Swati Maliwal: దాడి ఘటనలో స్వాతి మలివాల్‌తో ఆప్ సెటిల్‌మెంట్..?

Swati Maliwal

Swati Maliwal

Swati Maliwal: ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్‌పై దాడి చేశాడు. ఆమెతో పీఏ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. దీనిపై కేజ్రీవాల్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మలివాల్‌పై జరిగిన దాడిపై ఆప్ స్పందించిన ఒక రోజు తర్వాత సంజయ్ సింగ్, స్వాతి మలివాల్ నివాసంలో ఆమెను బుధవారం కలిశారు. సంజయ్ సింగ్ వెంట ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యురాలు వందన కూడా ఉన్నారు. ఈ దాడి ఘటనలో స్వాతి మలివాల్‌తో సెటిల్‌మెంట్ కోసమే వీరిద్దరు ఆమె నివాసానికి వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: Supreme Court: “గర్భంలో పిండానికి కూడా జీవించే హక్కు ఉంటుంది”.. అవివాహిత పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తనపై దాడికి పాల్పడ్డారని ఆప్ రాజ్యసభ ఎంపీ మలివాల్ సోమవారం ఆరోపించారు. దీనిపై పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, దీనిపై స్వాతి మలివాల్ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్ మలివాల్‌తో “అనుచితంగా ప్రవర్తించారు” మరియు ఈ విషయంలో ఆప్ అధినేత కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ‘‘స్వాతి మలివాల్ కేజ్రీవాల్‌ని కలిసేందుకు అతని నివాసానికి వెళ్లారు. అయితే ఆమె డ్రాయింగ్ రూంలో కూర్చుని ఉండగా బిభవ్ కుమార్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఇది అత్యంత ఖండించదగిన సంఘటన’’ అని సంజయ్ సింగ్ అన్నారు.

అయితే, ఈ వ్యవహారం ఆప్ వర్సెస్ బీజేపీగా మారింది. దీనిపై ఫిర్యాదు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేజ్రీవాల్ సహాయకుడిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేయడంతో పాటు కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు, మహిళా మోర్చా బుధవారం కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై సీఎం కేజ్రీవాల్ మౌనాన్ని ప్రశ్నించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌గా పని చేసిన ఓ మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా.. ఆమెకు మద్దతు ఇచ్చేందుకు మేం ఉన్నామని, ఈ ఘటనను ఆప్ నేత సంజయ్ సింగ్ అంగీకరించారని, కేజ్రీవాల్ నిందితుడిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని సచ్‌దేవా ప్రశ్నించారు.