NTV Telugu Site icon

Arvind Kejriwal: ఆప్‌ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు.. కర్ణాటకలో అధికారంలోకి వస్తాం..!

Arvind Kejriwal

Arvind Kejriwal

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని నెల‌కోల్పామ‌ని, ఇక త‌మ దృష్టి అంతా క‌ర్నాట‌క‌పైనే ఉంచుతామని ప్రకటించారు. క‌ర్నాట‌క‌లో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగ‌ళూరులో పర్యటించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిప‌డ్డారు. రావ‌ణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుంద‌ని విమ‌ర్శించారు. అందుకే సాగు చ‌ట్టాల‌ను తీసుకొచ్చార‌ని విమ‌ర్శించారు. రైతుల‌తో చెలగాటాలొద్దని తాము బీజేపీని ప‌దే ప‌దే హెచ్చరించినా.. పెడ చెవిన పెట్టింద‌ని, చివ‌రికి సాగు చ‌ట్టాను వెన‌క్కి తీసుకుంద‌న్నారు. ప్రజలకు పాఠశాలలు, ఆసుపత్రులు, ఉచిత విద్యుత్, ఉచిత రవాణా మరియు ఉచిత నీరు కావాలంటే, వారు ఆప్‌కి ఓటు వేయాలని బెంగళూరులో జరిగిన రైతు ర్యాలీలో పిలుపునిచ్చారు కేజ్రీవాల్‌..

Read Also: Nampally Court: బంజారాహిల్స్ డ్రగ్ కేసు.. నిందితులకు కోర్టులో చుక్కెదురు

ఢిల్లీ, పంజాబ్‌లలో మాదిరిగానే కర్ణాటకలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కేజ్రీవాల్.. అవినీతికి వ్యతిరేకంగా చట్టం చేయాలని డిమాండ్ చేసినప్పుడు మేం, సామాన్య ప్రజలు రాజకీయాల్లోకి రావాలని సవాలు చేసాం. మేము రాజకీయ పార్టీని ఏర్పాటు చేసాం. మా మొదటి ప్రభుత్వం ఢిల్లీలో మరియు తరువాత పంజాబ్‌లో ఏర్పడింది. ఇప్పుడు, మేము మా తదుపరి ప్రభుత్వాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేస్తాం అన్నారు.. కర్నాటకలో అవినీతి గురించి కేజ్రీవాల్ మాట్లాడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వం 20 శాతం కమీషన్ ప్రభుత్వం.. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని విమర్శించారు.. కర్నాటక గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ వసూలు చేశారని సూసైడ్ నోట్‌లో ఆరోపించిన సివిల్ కాంట్రాక్టర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు.

ఢిల్లీలో సున్నా శాతం కమీషన్ ప్రభుత్వం ఉంది.. ఎందుకంటే ఢిల్లీలో హార్డ్ కోర్ నిజాయితీ ప్రభుత్వం ఉంది. ఒక్క పైసా కూడా లంచంగా తీసుకోబడదు అన్నారు కేజ్రీవాల్.. అత్యంత నిజాయితీ గల ప్రభుత్వమని ప్రధాని నరేంద్ర మోడీ సర్టిఫికేట్ పొందామని.. తనపై, డిప్యూటీ మనీష్ సిసోడియాతో పాటు 17 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ, ఆదాయపు పన్ను, ఢిల్లీ పోలీసులు దాడులు నిర్వహించారని, అయితే, ఏజెన్సీలు ఏమీ కనుగొనలేకపోయాయని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న రౌడీలు, పోకిరీలు, అనైతికత, అవినీతిపరులు అందరూ ‘ఒకే రాజకీయ పార్టీకి’ వెళతారని ఎద్దేవా చేశారు.. ఒక మంత్రి కొడుకు రైతులపైకి జీపు ఎక్కించి చంపేస్తాడు, కానీ, అతని తండ్రికి మంత్రి పదవి ఇస్తారు. ఎవరు అత్యాచారం చేసినా ఘనస్వాగతం లభిస్తుందని మండిపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్.