NTV Telugu Site icon

Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే.

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Aaditya Thackeray Joins Bharat Jodo Yatra, Marches With Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రస్తుతం జోడో యాత్ర మహారాష్ట్రకు చేరింది. యాత్ర ప్రారంభమై 65వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉంటే శుక్రవారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గ నేత, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు. హింగోలిలోని కలమ్నూరిలో రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్రశాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అంబాదాస్ దాన్వే, మాజీ ఎమ్మెల్యే సచిన్ అహిర్ కూడా పాల్గొన్నారు.

Read Also: Beauty and Powerful Cop: వరల్డ్ మోస్ట్ హాట్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఎవరో తెలుసా?

ఉద్ధవ్ ఠాక్రేను కూడా పాదయాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ ఆహ్వానించింది. గతంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని చెప్పాడు. అయితే తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో శరద్ పవార్ యాత్రలో పాల్గొనలేకపోయారు. గతంలో ఎన్నికల అనంతర శివసేన, బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత ఈ పొత్తును విమర్శిస్తూ.. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయడం.. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఏక్ నాథ్ షిండేకు మద్దతు తెలపడంతో బీజేపీ సహాయంతో ఏక్ నాథ్ షిండే సారథ్యంలో ఇటీవల మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

శివసేన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తొలిసారిగా మహారాష్ట్ర వచ్చిన రాహుల్ గాంధీతో కలిసి ఆదిత్య ఠాక్రే భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా పోటీ చేయబోతున్నాయనే వార్తల నేపథ్యంలో వీరిద్దరి కలయిక చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 7న ఈ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3570 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ పాదయాత్ర జరగనుంది. ఐదు నెలల పాటు జరిగే ఈ యాత్రం కాశ్మీర్ లో ముగుస్తుంది.