మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బెళగావిలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఓటర్ల జాబితాలో కుట్ర జరిగిందని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 72 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారని తెలిపారు. ఆ నియోజకవర్గాల్లో 102 స్థానాలను బీజేపీ గెలుచుకుందని వెల్లడించారు. ఓటర్ల జాబితాలో మార్పులు కారణంగానే బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ఫలితాల వెనుక సీఈసీ పాత్ర అనుమానాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. ఎన్నికల సంఘాన్ని కలిసి ఆందోళన వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలను, ఓటర్ల సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ఎత్తి చూపించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత 47 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరారని చేపించింది. అయితే కాంగ్రెస్ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. కేవలం 2 శాతం మందే కొత్తగా చేరారని తెలిపింది. కొత్త ఓటర్లంతా 18-19 వయసు వారని పేర్కొంది.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మహాయుతి కూటమి 230 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాలే గెలుచుకుంది.