వాళ్లిద్దరిది కాటికి కాలు చాపిన వయసు. ఎప్పుడు పోతారో తెలియదు. అలాంటి వయసులో ప్రేమలో పడ్డారు ఇద్దరు వృద్ధులు. భారతీయ వృద్ధుడిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా అమెరికా నుంచి వచ్చేసింది వృద్ధురాలు. కానీ మరణాన్ని ఊహించక హత్యకు గురైంది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ ఘోరం జరిగింది.
75 ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ గ్రేవాల్ ఎన్నారై. ఇంగ్లాండ్‌కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్. రూపిందర్ కౌర్ పాంధర్(71) భారత సంతతికి చెందిన అమెరికా పౌరురాలు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. గ్రేవాల్ ఆహ్వానం మేరకు వివాహం చేసుకునేందుకు జూలైలో రూపిందర్ కౌర్ పంజాబ్‌లోని లూథియానాకు వచ్చింది. కానీ కొద్దిసేపటికే ఆమె హత్యకు గురైంది.
ఇది కూడా చదవండి: Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై జిమ్మీ కిమ్మెల్ ఎగతాళి.. లైవ్‌షో బహిష్కరిస్తున్నట్లు నెక్స్‌స్టార్ ప్రకటన
అయితే జూలై 24న రూపిందర్ కౌర్ పాంధర్ సోదరి కమల్ కౌర్ ఖైరా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా జూలై 28న కమల్ కౌర్ న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించింది. స్థానిక పోలీసులపై ఒత్తిడి చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టగా.. మల్హాపట్టికి చెందిన సుఖ్జీత్ సింగ్ సోనును అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చేది ఎప్పుడంటే..!
పాంధర్‌ను తన ఇంట్లో చంపి.. మృతదేహాన్ని స్టోర్‌రూమ్‌లో దహనం చేసినట్లుగా సోను అంగీకరించాడు. అయితే పాంధర్‌ను చంపితే రూ.50 లక్షలు ఇస్తానని గ్రేవాల్ ఒప్పందం కుదుర్చుకున్నాడని.. అతని సూచన మేరకు ఈ హత్య చేసినట్లుగా సోను వివరాలు తెలియజేశాడు. దీంతో పాంధర్ హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులకు గత వారం పోలీసులు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటన
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ హత్యకు ఆర్థిక విషయాలే కారణమని చెప్పారు. పాంధర్ అమెరికా నుంచి భారత్‌కు వచ్చేటప్పుడు గ్రేవాల్‌కు భారీ మొత్తంలో డబ్బులు బదిలీ చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో పాంధర్‌ను వదిలించుకుంటే.. ఆ డబ్బుంతా నొక్కేయవచ్చన్న దుర్బుద్ధితో గ్రేవాల్ ఈ హత్య చేయించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రేవాల్ పరారీలో ఉన్నాడు. అతడు దొరికితే మరింత సమాచారం రాబట్టనున్నారు. పరారీలో ఉన్న గ్రేవాల్‌ను కేసులో అనుమానితుడిగా చేర్చినట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ సతీందర్ సింగ్ తెలిపారు. ఇక నిందితుడు సమాచారం మేరకు బాధితురాలి అస్థిపంజర అవశేషాల కోసం, ఇతర ఆధారాల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.