Farmers protest: రైతులు తమ హామీలను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీకి వెళ్లే ప్రయత్నంలో భాగంగా రైతులు పెద్ద సంఖ్యలో హర్యానా, పంజాబ్, ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు హర్యానా పోలీసులతో పాటు పోలీసులతో పాటు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. 200 రైతు సంఘాలు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ), రైతు ఉద్యమ సమయంలో కేసులు ఎత్తివేయాలని, లఖీంపూర్ ఖేరీ బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు పిలుపునిచ్చాయి.
Read Also: Alaskapox: అలస్కాపాక్స్ కారణంగా ఒకరు మృతి.. వ్యాధి లక్షణాలు, కారణాలు తెలుసుకోండి..
ఇదిలా ఉంటే, రైతులు పక్కా ప్రణాళికతో ఢిల్లీని ఆక్రమించేందుకు వస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయి. రైతుల నిరసన కోసం ఒక్క పంజాబ్ నుంచే 1500 ట్రాక్టర్లు, 500 వాహనాలను సమీకరించారు, ఆరు నెలలకు సరిపడే ఆహారం, రేషన్, లాజిస్టిక్ సదుపాయాలను సమకూర్చుకున్నారని ఇంటెల్ నివేదికలు సూచిస్తున్నాయి. రైతులు ఢిల్లీకి ప్రవేశించేందుకు శంభు బోర్డర్ (అంబలా), ఖనోరి (జింద్), మరియు దబ్వాలి (సిర్సా) మార్గాల్ని ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించాయి.
వీటితో పాటు గురుద్వారాలు, ఆశ్రమాలను రహస్య స్థావరాలుగా మార్చుకుంటున్నారని నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించాయి. ట్రాక్టర్లను షెల్టర్లుగా, నివాసానికి అనుగుణంగా మార్చేందుకు మాడిఫై చేశారని, పోలీసులు అమర్చిన బారికేడ్లు, కాంక్రీట్ దిమ్మల్ని తొలగించే విధంగా మార్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. మరోవైపు, రైతుల నిరసనకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కెఎంఎస్‌సి) సీనియర్ నేతలు, కోర్ కమిటీ కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్,తమిళనాడులను సందర్శించి ఆయా రాష్ట్రాల రైతుల నుండి మద్దతు కోరింది.