5G services will start from October 1: భారతదేశంలో మొబైల్ నెట్ వర్క్ లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. 5 జీ ప్రారంభానికి డేట్ పిక్స్ అయింది. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో 5 జీ సేవలు ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు మరింత మెరుగైన ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. తొలి విడతలో దేశంలోని 13 నగరాల్లో 5 జీ సేవలను ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై మరియు పూణే నగరాల్లో తొలుత 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. వీటి తరువాత దశల వారీగా దేశవ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ సేవలను విస్తరించనున్నారు.
అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ 5జీ సేవలను ప్రారంభిస్తారని జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ ఈరోజు ట్వీట్ చేసింది. భారతదేశం డిజిటల్ పరివర్తన, కనెక్టవిటీ కొత్త శిఖరాలకు తీసుకెళ్తూ.. ప్రధాని నరేంద్రమోదీ 5జీ సేవలను ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు అని ట్వీట్ చేసంది. ఆసియాలోనే అతిపెద్ద టెలికాం, మీడియా, టెక్నాలజీకి సంబంధించి ఇండియా మొబైల్ కాంగ్రెస్ నిర్వహించనున్నారు. భారత్ తో 5జీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2023-2040 మధ్యకాలంలో ఇండియా ఎకానమీకి రూ. 36.4 ట్రిలియన్ల మేలు జరిగే అవకాశం ఉందని మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లోబల్ ఇండస్ట్రీ బాడీ ఇటీవలి నివేదిక అంచనా వేసింది.
2030 నాటికి మొత్తం కనెక్షన్లలో 5జీ వాటా మూడవ వంతకు చేరుకుంటుదని.. 2జీ, 3జీ 10 శాతం కన్నా తగ్గిపోతుందని గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ నివేదిక పేర్కొంది. తయారీ రంగంలో 20 శాతం, రిటైల్ రంగంలో 12 శాతం, వ్యవసాయం 11 శాతం వరకు 5జీ సేవల వల్ల లాభపడుతాయని అంచానా వేసింది.
ప్రస్తుతం ఉన్న 4జీ కన్నా 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని 5జీలో పొందవచ్చు. 5జీ వేగం 10 జీబీపీఎస్ వరకు ఉంటుంది. అదే 4జీ వేగం 100 ఎంబీపీఎస్ వరకు మాత్రమే ఉంది. 5 స్పెక్ట్రమ్ వేలంలో దేశంలోని జియో, భారత్ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, అదానీ డేటా నెట్వర్క్ లు 5 జీ స్పెక్ట్రమ్ సొంతం చేసుకున్నాయి.