NCP Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ప్రధానాంశంగా మారింది. ఆదివారం ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం సంచలనంగా మారింది. పార్టీ చీఫ్ శరద్ పవార్ కి అజిత్ పవార్ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉంటే అజిత్ పవార్ వర్గంలో చేరిన మరో కీలక నేత ప్రఫుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో 53 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 51 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలపాలని పార్టీ చీఫ్ శరద్ పవార్ ని కోరారని ఆయన అన్నారు. గతేడాది మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఎన్డీయే చేరాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అనిల్ దేశ్‌ముఖ్, నవాబ్ మాలిక్ మాత్రమే హాజరు కాలేదని ఆయన తెలిపారు.
Read Also: PM Modi: ఉగ్రవాదంపై పాక్ పీఎంకి ధమ్కీ ఇచ్చిన మోడీ..
ఎన్సీపీ, శివసేనతో చేతులు కలిపితే.. బీజేపీతో ఎందుకు చేతులు కలపకూడదని ఆయన ఓ స్థానిక న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. గత ఏడాది బీజేపీ కూటమిలో చేరడంపై అంతర్గత చర్చలు జరిగాయని పటేల్ చెప్పారు. ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగిందని అన్నారు. అయితే ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేదని.. ఇది అజిత్ పవార్ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం కాదని ప్రఫుల్ పటేల్ అన్నారు.
శరద్ పవార్ కి షాకిస్తూ అజిత్ పవార్ ఆదివారం బీజేపీ- ఏక్ నాథ్ షిండే శివసేన కూటమి ప్రభుత్వంలో చేరారు. శరద్ పవార్ అన్ని కుమారుడైన అజిత్ పవార్ గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలేని నియమించడం కూడా ఆయన ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తున్న క్రమంలో ఆయన ఎన్సీపీలో చీలిక తీసుకువచ్చారు. గతంలో పలు సందర్భాల్లో ప్రధాని మోడీ పాలనను కూడా బహిరంగంగా పొగుడారు.