AIIMS: ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఎంతో క్లిష్టమైన, అత్యంత అరుదైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. 5 ఏళ్ల బాలిక మెలుకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. ఇలా ఇంత చిన్న వయసు ఇలాంటి సర్జరీ చేయించుకున్న వ్యక్తిగా ఈ ఐదేళ్ల చిన్నారి రికార్డుకెక్కింది. బాలిక మెదుడులోని ఎడమ పెరిసిల్వియన్ ఇంట్రాక్సియల్ బ్రెయిన్ ట్యూమర్‌ని తొలగించేందుకు ఆమె మెలుకువగా ఉండగానే క్రానియోటమీ (కాన్షియస్ సెడేషన్ టెక్నిక్) సర్జరీ జరిగింది.
సర్జరీ సమయంలో బాలిక చాలా బాగా సహకరించిందని వైద్యులు తెలిపారు. హై క్వాలిటీ ఎంఆర్ఐ బ్రెయిన్ స్టడీస్‌ని అందించడానికి న్యూరో అనస్థీషియా, న్యూరో రేడియాలజీ బృందాల ద్వారా అద్భుతమైన టీమ్ వర్క్, మద్దతు లభించిందని ఎయిమ్స్ అధికార ప్రకటనలో పేర్కొంది.
పేషెంట్ మెలుకువగా ఉన్న సమయంలోనే అవేక్ క్రానియోటమీ అనే సర్జరీ నిర్వహిస్తారు. అవేక్ క్రానియోటమీ అనేది న్యూరో సర్జికల్ టెక్నిక్. మెదడు దెబ్బతిన్నకుండా ఉండేందుకు రోగి మెలుకువగా ఉన్నప్పుడు మెదడు కణితిని తొలగించేందుకు ఈ సర్జరీని చేస్తారు. శస్త్రచికిత్స సమయంలో న్యూరో సర్జన్లు మెదడు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ రకమైన ఆపరేషన్ నిర్వహిస్తారు. కణితిని తీసేటప్పుడు మెదడుకు భంగం కలగకుండా ‘‘ఎలోక్వెంట్ బ్రెయిన్’’ అని పిలిచే ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించడానికి కార్టికల్ మ్యాపించ్ చేస్తారు.