Balakot Airstrike: బాలాకోట్ దాడులకు జరిగి నాలుగేళ్ల అయింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి పాాల్పడినందుకు గట్టిగా బుద్ది చెప్పింది. పుల్వామా ఎటాక్ లో 46 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. ఈ ఘటనపై యావత్ దేశం పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి ఘటన పాల్పడాలంటే పాక్ వెన్నులో వణుకు పుట్టేలా గుణపాఠం చెప్పాలని భారత్ భావించింది. ఈ నేపథ్యంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను మట్టుపెట్టి వచ్చింది.
ఎయిర్ స్ట్రైక్స్ జరిగిందిలా..
ఫిబ్రవరి 26, 2019లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను దాటి, పాక్ మెయిన్ ల్యాండ్ లోకి వెళ్లి దాడులు చేసింది. ఈ దాడులకు నాలుగేళ్లు నిండాయి. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 27న బాలాకోట్ వైమానిక దాడులను ధృవీకరించింది. రాత్రి సమయంలో 12 మిరాజ్ 2000 జెట్‌లు పాక్ బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేసి, వారందరిని మట్టుపెట్టాయి. ఇజ్రాయెల్ తయారు చేసిన స్పైస్ 2000 బాంబులతో భారత ఎయిర్ ఫోర్స్ భీకరదాడులు చేసింది.
తెల్లవారుజామున నియంత్రణ రేఖను దాటిన విమానాలు 3.30 గంటలకు దాడులను ప్రారంభించాయి. మిరాజ్ 2000 విమానాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తుంటే, పాకిస్తాన్ ఏదైనా దాడికి పాల్పడితే కౌంటర్ అటాక్ చేసేందుకు సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐలను సిద్ధం చేసింది భారత్. దీంతో పాటు మొత్తం ఆపరేషన్‌కు ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ విమానం నేత్రా సహకరించింది. ఈ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మరణించారు.
మిగ్ విమానంతో ఎఫ్-16ని కూల్చేసి అభినందన్..
ఈ దాడి జరిగిన తర్వాత ఫిబ్రవరి 27, 2019లో పాక్ వైమానిక దళం జమ్మూలోని రాజౌరీ సెక్టార్ లో దాడులు చేసేందుకు వచ్చాయి. అత్యాధుని అమెరికా తయారీ ఎఫ్-16 విమానాలను గుర్తించిన భారత్ వెంటనే ప్రతిదాడి చేశాయి. రష్యా తయారీ మిగ్-21 బైసన్ ను నడుపుతున్న అభినందన్ వర్థమాన్ ఎఫ్-16ని కూల్చేశాడు. ఈ సమయంలో అభినందన్ విమానం కూడా కూలిపోయి, పాకిస్తాన్ భూభాగంలో పారాశ్యూట్ సాయంతో ల్యాండ్ అయ్యాడు. అభినందన్ ను నిర్భందించిన పాక్ సైన్యం, అంతర్జాతీయ ఒత్తడి, భారత ప్రతిదాడికి భయపడి భారత్ కు అప్పగించింది. ఈ దాడిలో హైలెట్ ఏంటంటే ఒక ఎఫ్ -16 విమానాన్ని, పాత సోవియట్ తయారీ మిగ్-21 బైసన్ తో కూల్చడం.