DK Shivakumar: కర్ణాటక క్యాబినెట్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ముస్లిం వర్గాన్ని సంతృప్తి పరచడానికి, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ ముస్లిం లీగ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
Read Also: Harish Rao : కేసీఆర్ చావు కోరుకోవడం దారుణం.. కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది
అయితే, బీజేపీ నుంచి విమర్శలు వచ్చినప్పటికీ 4 శాతం రిజర్వేషన్లకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతు ఇచ్చారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈ విషయంలో మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ కోటా ఉద్యోగాలకు, విద్యకు కాదు, ఇది కాంట్రాక్టర్ల కోసమని, రూ. 1 కోటి విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులకు బిడ్డింగ్ వేయడానికి ఉద్దేశించబడిందని చెప్పారు. 4 శాతం ముస్లింలకు మాత్రమే అనే దానిని డీకే శివకుమార్ ఖండించారు. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా, అన్ని మైనారిటీ, వెనకబడిన తరగతులకు కూడా వర్తిస్తుందని హుబ్బళ్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు.
శుక్రవారం, సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ ప్రకటించారు. కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ (KTPP) చట్టానికి సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ల మాదిరిగానే ముస్లింలకు కాంట్రాక్టు పనులలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మైనారిటీ నాయకులు అభ్యర్థన సమర్పించారు. దీని తర్వాత సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిల్లుపై చర్చించారు.