NTV Telugu Site icon

Bangladesh: బంగ్లాదేశ్‌లో రెండో హిందూ పూజారి అరెస్ట్..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల అణిచివేత కొనసాగుతోంది. మైనారిటీల హక్కులపై పోరాడుతున్న హిందూ నేతలపై దేశద్రోహ కేసులు పెడుతూ, వాళ్లని జైళ్లలో నిర్బంధిస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీలపై దాడుల్ని కట్టడి చేయలేకపోతోంది. ముఖ్యంగా అక్కడి ప్రజల్లో భారత వ్యతిరేక భావాలను పెంచిపోషిస్తోంది. ఇస్కాన్‌ని బ్యాన్ చేయాలని అక్కడి రాడికల్ ముస్లింలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో హిందువులు, మైనారిటీల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆయనని అరెస్ట్ చేయడం, బెయిల్ ఇవ్వకపోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని వెంటనే అరికట్టాలని బంగ్లాదేశ్‌ని కోరింది.

Read Also: RSS On Bangladesh: బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిపై స్పందించిన ఆర్ఎస్ఎస్..

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌లో మరో ప్రముఖ హిందూ పూజారిని అక్కడి అధికారులు చేసినట్లు శనివారం తెలిసింది. అరెస్టయిన పూజారిని శ్యామ్ దాస్ ప్రభుగా గుర్తించారు. చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టు జరిగిన కొద్ది రోజులకే శ్యామ్ దాస్‌ని అరెస్ట్ చేశారు. చిన్మోయ్‌ని కలిసేందుకు వెళ్లిన సందర్భంలో ఈయన అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి అధికారిక వారెంట్ లేకుండానే అతడిని అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి రాధారామ్ దాస్ ఆయన అరెస్ట్ గురించి పోస్ట్ చేశారు.

చిన్మోయ్ అరెస్ట్ తర్వాత బెయిల్ నిరకరించడంతో మంగళవారం ఛటోగ్రామ్ కోర్టు వెలుపుల పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లాం హత్యకు గురయ్యారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మైనారిటీ హిందూ కమ్యూనిటీకి చెందిన 46 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసిన తర్వాత వారిని అరెస్టు చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Show comments