Maharashtra: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నాందేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లోనే 24 మంది మరణించారు. ఇందులో 12 మంది నవజాత శిశువులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు ఎక్కువగా పాము కాట్ల వల్ల మరణించినట్లు నాందేడ్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రి డీన్ తెలిపారు.
24 గంటల్లో ఆరుగురు మగ, ఆరుగు ఆడ శిశువులు మరణించారు. పన్నెండు మంది పెద్ద వారిలో చాలా మంది అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. ఎక్కువగా పాముకాట్లకు గురైన రోగులు మరణించినట్లు చెప్పారు. దీంతో పాటు సిబ్బంది ట్రాన్స్‌ఫర్లు ఈ సమస్యకు కారణమయ్యాయని డీన్ వెల్లడించారు. 80 కిలోమీటర్ పరిధిలో ఉన్న ఏకైక పెద్ద ఆస్పత్రి అని, రోగులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని, కొన్ని రోజులుగా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆయన చెప్పారు. మేము మందులు కొనాల్సి ఉంది, కానీ అలా జరగలేదని, స్థానికంగా మందులు కొనుగోలు చేసి రోగులకు అందిచామని డీన్ వెల్లడించారు.
ఈ మరణాలు దురదృష్ణకరమని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. ఆస్పత్రిలో ఏం జరిగిందనే దానిపై మరింత సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామని అన్నారు. మహరాష్ట్రలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్( బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ)పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మంది విషమంగా ఉన్నారు. వైద్య సదుపాయాలు సిబ్బంది కొరత ఉందని, చాలా మంది నర్సులను బదిలీ చేశారని, ఖాళీలను భర్తీ చేయలేదని మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అన్నారు. ఈ మరణాలకు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ బాధ్యత వహించాలని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే అన్నారు.