JN.1 Corona variant: దేశంలో కొత్త కోవిడ్-19 వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. ఇప్పటి వరకు దేశంలో కొత్త వేరియంట్ కేసులు 22 నమోదయ్యాయి. ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లోనే వెలుగులోకి వచ్చాయి. గోవాలో 21 కేసులు, కేరళలో ఒక కేసు నమోదైంది. అయితే JN.1 సోకిన వారంతా ఎలాంటి సమస్యలే లేకుండా కోలుకోవడం ఒకింత సంతోషకరమైన విషయం.
ఈ వేరియంట్ సోకిన వారికి తేలికపాటి పొడిదగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. నవంబర్‌లో, JN.1 వేరియంట్‌ను గుర్తించడం కోసం మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 62 నమూనాలను వివిధ INSACOG ల్యాబ్‌లకు పంపగా, డిసెంబర్‌లో ఇప్పటివరకు 253 నమూనాలను పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Priyanka : పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై మొదటిసారి నోరు విప్పిన ప్రియాంక..ఏమందంటే?
కేరలలో 79 ఏళ్ల మహిళకు JN.1 వేరియంట్ సోకినట్లు డిసెంబర్ 8న గుర్తించారు. సదరు మహిళ ఎలాంటి ఆరోగ్యపరమైన చిక్కులు లేకుండా కోలుకున్నారు. దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. JN.1 సబ్ వేరియంట్ సోకిన వారిలో 92 శాతం మంది ఇంటి దగ్గరే కోలుకునే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ సోమవారం వెల్లడించారు. అయితే రాబోయే పండగ సీజన్ నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. కోవిడ్ నియంత్రణ పకడ్బందీగా పాటించాలని కోరింది.
శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారత్ లో ప్రస్తుతం 2997 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కేరళలో మరో మరణం చోటు చేసుకోవడంతో మరణాల సంఖ్య 5,33,328కి చేరుకుంది. JN.1 (BA.2.86.1.1), ఆగస్టులో లక్సెంబర్గ్‌లో తొలిసారి కనుగొన్నారు.