Site icon NTV Telugu

Arvind Kejriwal: బీజేపీ నన్ను అరెస్ట్ చేయాలనుకుంటోంది.. లిక్కర్ స్కామ్‌పై కేజ్రీవాల్ సంచలనం..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈ రోజు ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందనే ఊహాగానాల నడుమ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజం ఏంటంటే.. అవినీతే జరగలేదని, బీజేపీ తనను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని ఆయన అన్నారు. నా పెద్ద ఆస్తి నిజాయితీ అని, వారు దానిని దెబ్బతీయాలనుకుంటున్నారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. తనకు పంపిన ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. బీజేపీ లక్ష్యం తనను అరెస్ట్ చేయించడమే కాదని, తనను లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవడమే అని చెప్పారు. దర్యాప్తును సాకుగా చెప్పి తనను అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు.

Read Also: S Jaishankar: “నెహ్రూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు”.. చైనా సంబంధాలపై జైశంకర్..

రెండేళ్లుగా బీజేపీ కేంద్ర సంస్థల్ని ఉపయోగించి పలువురిని అరెస్ట్ చేసిందని, ఈ స్కామ్‌లో ఒక్క రూపాయి కూడా పట్టుబడలేదని, స్కామ్ జరిగితే ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని, గాలిలో మాయమైందా..? అంటూ ప్రశ్నించారు. నిజం ఏంటంటే అసలు స్కామే జరగలేదని కేజ్రీవాల్ అన్నారు. దేశంలో గుండాయిజం పెరిగిందని, ఎవరినైనా అరెస్ట్ చేసి లోపలేస్తోందని ఆరోపించారు. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమని, దీనిపై ఈడీకి లేఖ రాస్తూ ఎలా చట్టవిరుద్ధమో వివరించాలని, వారి నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల ముందే తనకు ఎందుకు సమన్లు పంపారని ప్రశ్నించారు. 8 నెలల క్రితం సీబీఐ పిలిచినప్పుడు వెళ్లానని, అయితే ఇప్పుడే తనను ఎందుకు విచారణ పేరుతో పిలుస్తున్నారంటూ ప్రశ్నించారు.

ఇప్పటి వరకు కేజ్రీవాల్‌కి ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేసింది. మూడుసార్లు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనను ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆప్ లోని కీలక నేతల్లో భయాందోళన మొదలైంది. అయితే అలాంటిదేం లేదని ఈడీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ మద్యం కేసులో నాలుగో సారి సమన్లను జారీ చేసేందుకు ఈడీ మరోసారి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ విచారణతో పిలిచి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కూడా ఇలాగే జరుగుతుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

Exit mobile version