Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ వరస ఎన్‌కౌంటర్లతో అట్టుడుకుతోంది. బుధవారం నుంచి కాశ్మీర్ ప్రాంతంలో ఏదో చోట ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంటుంది. శనివారం బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభం అయింది. మరోవైపు రాజౌరీలో శుక్రవారం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది. రాజౌరీ ఎన్‌కౌంటర్ ఇప్పటికే 9 పారా కమాండో దళానికి చెందిన నలుగురు జవాన్లు, సైన్యానికి చెందిన ఒకరు మొత్తం ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
Read Also: Rajouri terror attack: పీఓకే నుంచి రాజౌరి ఉగ్రదాడి.. లష్కర్ తీవ్రవాది సజ్జిద్ జుట్ హస్తం..
ఇదిలా ఉంటే ఈ రోజు ఈ రెండు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతాబలగాలు. రాజౌరీలోని అటవీ ప్రాంతాల్లోని గుహల్లో వేళ్లూనుకున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ‘ఆపరేషన్ త్రినేత్ర’లో భాగంగా భారీ బలగాలను ఆ ప్రాంతానికి తరలించారు. రక్షణ మంత్రి క్షేత్రస్థాయిలో ఆపరేషన్ ను సమీక్షిస్తున్నారు. కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సైన్యానికి చెందిన కమాండర్లు, కీలక అధికారులు శ్రీనగర్ వెళ్తున్నారు. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జమ్మూ కాశ్మీర్ పోలీసు డిజిపి ఆపరేషన్ని పర్యవేక్షిస్తున్నారు.
బారాముల్లా ఎన్‌కౌంటర్ లో హతమైన ఉగ్రవాదిని లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. చనిపోయిన ఉగ్రవాదిని అబిద్ వనీగా గుర్తించారు. కుల్గామ్ లోని హార్హోల్ బాబాపురాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడి నుంచి ఉగ్రవాద సాహిత్యం, ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు రాజౌరీ ఎన్‌కౌంటర్ లో కూడా ఒక ఉగ్రవాదిని భద్రతాబలగాలు మట్టుపెట్టాయి. చనిపోయిన ఉగ్రవాది నుంచి ఏకే-56, పిస్టల్స్, మ్యాగజైన్, గ్రెనేడ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఉగ్రవాది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.