Site icon NTV Telugu

Ram Navami violence: ఆరు రాష్ట్రాల్లో రామనవమి రోజు హింసాకాండ.. బెంగాల్లో రెండో రోజు ఘర్షణలు..

Ram Navami Violence

Ram Navami Violence

Ram Navami violence: శ్రీరామ నవమి రోజు ఆరు రాష్ట్రాల్లో హింసాకాండ జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు సమయంలో రెండు వర్గాల వారు ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. మహరాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్ లో మరొకరు మరణించారు. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది.

మహారాష్ట్ర:

మహారాష్ట్రలోని ఔరంగాబాద్, మలాడ్ మరియు జల్గావ్ అనే మూడు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఔరంగాబాద్‌లో, ఛత్రపతి సంభాజీనగర్‌లోని కిరాడ్‌పురా ప్రాంతంలోని రామాలయం వెలుపల ఇద్దరు వ్యక్తుల మధ్య బుధవారం జరిగిన గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది, ప్రజలు రాళ్లు రువ్వడంతో పాటు 13 వాహనాలకు నిప్పు పెట్టారు.టియర్ గ్యాస్, ప్లాస్టిక్ బుల్లెట్లను ఉపయోగించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపు 500 మంది గుంపు రాళ్లు, పెట్రోల్ బాటిళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో షేక్ మునీరుద్దీన్ అనే 51 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ముంబై మలాడ్ ప్రాంతంలో శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణ తలెత్తింది. జల్ గావ్ లో కూడా ఉద్రిక్త పరిస్థితులు తెలత్తాయి.

పశ్చిమ బెంగాల్:

రామనవమి వేడకల సమయంలో హౌరాలో భారీగా హింసాకాండ చెలరేగింది. హౌరా, దల్ ఖోలా ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. హౌరాలోని కాజీపరా ప్రాంతంలో ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. శిబ్ పూర్ లోనూ ఇదే విధంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దల్ ఖోలా ప్రాంతంలో చెలరేగిన ఘర్షణల్లో ఒకరు మరణించారు. ఇదిలా ఉంటే రెండో రోజు శుక్రవారం కూడా హౌరాలో ఘర్షణలు తలెత్తాయి. అల్లర్లకు పాల్పడిన వారిని హెచ్చరించారు సీఎం మమతా బెనర్జీ. ఇది బీజేపీ గుండాలు చేస్తున్న పనిగా ఆరోపించారు.

గుజరాత్:

గుజరాత్‌లోని వడోదర నగరంలోని ఫతేపురా ప్రాంతంలో రెండు రామనవమి ఊరేగింపులపై దాడి జరిగింది. ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రోడ్డుపై ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పాల్గొన్న 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటక:

గురువారం కర్ణాటకలోని హసన్ లోని ఒక మసీదు మీదుగా వెళ్తున్న రామనవమి ఊరేగింపు సమయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ అల్లర్లలో నలుగురికి గాయాలు అయ్యాయి.

ఉత్తర్ ప్రదేశ్:

గురువారం లక్నోలోని షాహి మసీదు సమీపంలో రామనవమి శోభా యాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వారు, ప్రజలపై దాడులు చేశారు. ఉరేగింపు మసీదు గుండా వెళ్తున్న సమయంలో పెద్ద శబ్ధంతో సంగీతం వినిపించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

బీహార్:

హజ్రత్‌గంజ్ మొహల్లా ప్రాంతంలోకి రామనవమి ఊరేగింపు సమయంలో హింస చెలరేగింది. 200 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు అయ్యాయి.

వరసగా రెండో ఏడాది హిందువుల పండగ సందర్భంగా హింస, అల్లర్లు చోటు చేసుకున్నాయి. గతేడాది ఏప్రిల్ నెలలో హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా 10 రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల్లో ఘర్షణలు జరిగాయి. ఈ సారి ఢిల్లీలో జహంగిర్ పూరి ప్రాంతంలో ముందు జాగ్రత్తగా భారీ బలగాలనుమ ోహరించారు.

 

 

Exit mobile version