NTV Telugu Site icon

1985 Air India bombing: ఖలిస్తానీ ఉగ్రవాద దుశ్చర్యకు 39 ఏళ్లు.. “ఎయిర్ ఇండియా కనిష్క” బాంబుదాడి..

1985 Air India Bombing

1985 Air India Bombing

1985 Air India bombing: జూన్ 23, 1985 ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు దాడి భారత్ ఎప్పటికీ మరిచిపోలేని ఉగ్రదాడిగా మిగిలిపోయింది. ఈ ఏడాదితో ఈ ఉగ్రఘటనకు 39 ఏళ్లు. ఖలిస్తానీ ఉగ్రవాదులు కెనడా నుంచి ఇండియాకు వస్తున్న ఎయిర్ ఇండియా కనిష్క 182 విమానాన్ని బాంబులతో పేల్చేశారు. కెనడాలోని మాంట్రియల్ నుంచి లండన్, ఢిల్లీ మీదుగా ముంబై చేరాల్సిన విమానం అట్లాంటిక్ మహాసముద్రంపై కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 329 మంది మరణించారు. మొదటి స్టాప్ ఓవర్ లండన్ హీత్రూ విమానాశ్రయంలో దిగడానికి 45 నిమిషాల ముందు ఐర్లాండ్ తీరానికి 190 కి.మీ దూరంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూలిపోయింది. రాడాన్ నుంచి అదృశ్యమైన వెంటనే రెస్క్యూ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఒక్క ప్రయాణికుడు కూడా బతకలేదు. సముద్రం నుంచి 131 మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీసింది. విమానం 31,000 ఫీట్‌ల ఎత్తులో ఉన్న సమయంలో బాంబు పేలుడు సంభవించినట్లు తేలింది. ఈ ప్రమాదంలో 268 మంది కెనడా పౌరులు, 27 మంది బ్రిటీష్ జాతీయులు, 24 మంది భారతీయులు మరణించారు.

Read Also: Stone Pelting: పోలీసులు-గ్రామస్తులకు మధ్య వాగ్వాదం.. పోలీస్‌స్టేషన్‌పై రాళ్ల దాడి

ఖలిస్తానీ తీవ్రవాదుల దుశ్చర్య:

ఈ ఘటనకు ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూప్ ‘బబ్బర్ ఖల్సా’ పాల్పడినట్లు విచారణలో తేలింది. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా తల్విందర్ సింగ్ పర్మార్ వ్యవహారించినట్లు కెనడా పోలీసులు ఆరోపించారు. మరో నిందితుడు ఇందర్ జిత్ సింగ్ రేయత్ ను ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరితో పాటు రిపుదమన్ సింగ్ మాలిక్ మరియు అజైబ్ సింగ్ బగ్రీలను 2000లో అరెస్టు చేశారు. వీరిపై ఆధారాలు లేకపోవడంతో విడుదల చేశారు. ప్రపంచంలో హేయమైన ఉగ్రవాద ఘటనల్లో ఇది నిలిచింది.

2006లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 బాంబు దాడిపై విచారణ జరిపేందుకు కెనడియన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 2018లో, 1985 ఎయిర్ ఇండియా బాంబు దాడి జరిగిన 33 సంవత్సరాల తర్వాత, 329 మంది బాధితులకు నివాళులు అర్పించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ సంఘటనను దేశ చరిత్రలో “ఒకే అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడి”గా అభివర్ణించారు.

మళ్లీ యాక్టివ్ అయిన ఖలిస్తానీలు:

కెనడాలోని ట్రూడో ప్రభుత్వం ఖలిస్తానీ వేర్పాటువాదులపై మెతక వైఖరి ప్రదర్శిస్తుండటంతో ఖలిస్తానీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్, గురుపత్వంత్ సింగ్ పన్నూ వంటి వారికి మద్దతుగా నిలుస్తున్నారు. గతేడాది నిజ్జర్‌ని కాల్చి చంపారు. ఈ పరిణామం భారత్-కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలకు కారణమైంది.

కెనడా పార్లమెంట్లో ఎంపీ ఆర్య మాట్లాడుతూ.. ఖలిస్తానీ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను జరుపుకోవడంతో చీకటి శక్తులు మళ్లీ శక్తివంతమయ్యాయని పేర్కొంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే జూన్ 23న 1985 ఎయిర్ ఇండియా బాధితుల సంస్మరణ సభను టొరంటోలో నిర్వహించనుంది.