Maharashtra: ప్రస్తుత రోజుల్లో ప్రజల నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వాలు భారీగా నగదు వసూలు చేస్తున్నాయి. కానీ ఆ నగదును ప్రజల సౌకర్యాల కోసం వాడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఓ గ్రామానికి అక్కడి ప్రభుత్వం కనీస సౌకర్యాలను కల్పించడంలో దారుణంగా విఫలం అవుతోంది. ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యను తీర్చలేదు. కానీ 19 ఏళ్ల యువతి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రభుత్వాలు చేయలేని పని చేసి శభాష్ అనిపించుకుంటోంది. తనకు తోచిన పద్ధతిలో ప్రజల సమస్యలను తీర్చుతూ బాసటగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఆ గ్రామం పేరు పాలట్ పడా. థానే జిల్లాలో ఈ గ్రామం ఉంది. అయితే పాలట్ పడాలో ఇప్పటికీ పాఠశాల లేదు.
Read Also: Samantha: సర్జరీ కోసం అమెరికాకు సమంత.. దేని కోసం ఇంకా..?
పాలట్ పడా గ్రామంలోని పిల్లలు చదువుకోవాలంటే కిలోమీటర్ దూరం నడిచి పక్క గ్రామానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. తమ గ్రామంలో పాఠశాల నిర్మించాలని.. రోడ్డు వేయాలని ప్రజలు ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో ఆ గ్రామానికి పాఠశాల, రోడ్డు రాలేదు. అయితే కంటా చింతామన్ అనే 19 ఏళ్ల యువతి తన సమస్యలతో పోరాటం చేస్తూనే ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఆ తర్వాత చదువుకు దూరమైంది. చదువు విలువ తెలుసుకున్న ఆమె.. ఇతర విద్యార్థులు తనలా పాఠశాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చిన్నపాటి మర పడవను ఏర్పాటు చేసింది. చెరువు చుట్టూ తిరిగి.. రాళ్ల మార్గంలో బడికి వెళ్తున్న విద్యార్థులను తాను తయారు చేసిన పడవలో ఎక్కించుకుని పాఠశాలకు పంపుతోంది. ఇలా విద్యార్థులను తన పడవలో ఎక్కించుకున్నందుకు సదరు యువతి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకపోవడం స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాగా సుమారు 25 మంది గిరిజన కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేకపోవడం గమనించాల్సిన విషయం. ఇప్పటికైనా యువతిని చూసి అధికారులు కళ్లు తెరుస్తారేమోనని స్థానిక ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.