దేశాన్ని కరోనా వైరస్ ఇంకా వేధిస్తూనే ఉన్నది. రోజువారీ కేసులు అనేక రాష్ట్రాల్లో తక్కువగా నమోదవుతున్నా, తీవ్రత మాత్రం తగ్గడంలేదు. కొన్ని రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా కనిపిస్తున్నది. దీంతో ఆయా రాష్ట్రాలపై కేంద్రం దృష్టిసారించింది. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా అంతకంతకు పెరుగుతున్నది. ఈశాన్యరాష్ట్రమైన సిక్కింలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు 18శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలే 98 నమూనాలను జీనోమ్ స్వీక్వెల్ కోసం పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణ్ పట్టణంలో ఉన్న ఓ ల్యాబ్‌కు పంపింది సిక్కిం ప్రభుత్వం.
Read: బెంగుళూరులో బాలీవుడ్ బ్యూటీ! శాండల్ వుడ్ ఎంట్రీకి శ్రీలంక సుందరి రెడీ!
అయితే, 98 నమూనాల్లో 97 పాజిటివ్ గా నమోదు కావడంతో ఒక్కసారిగా సిక్కిం రాష్ట్రం ఉలిక్కిపడింది. పాజిటివ్ కేసులు నమోదైన 97 మందిలో డెల్టావేరియంట్ ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో కట్టడికి కఠిన చర్యలు తీసుకునేందుకు ఆ రాష్ట్రం సిద్ధం అయింది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రుల్లో చేరాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని హెచ్చరించింది.